భారీ వర్షాలతో మహారాష్ట్ర(Maharashtra Rains) వణికిపోతోంది. ఔరంగాబాద్, జల్గా పాల్గఢ్, జల్గావ్ జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత కారణంగా.. కొండచరియలు విరిగిపడి(Landslide) రహదారులు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఔరంగాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 52పై కొండచరియలు విరిగిపడడం వల్ల సోలాపుర్, ధూలే జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ట్రాఫిక్‌ను మళ్లించారు. ఔరంగాబాద్ జిల్లాలోనే కన్నడ్ తాలుకా బిదరి గ్రామం నీట మునిగింది. సహాయక బృందాలు గ్రామానికి చేరడం కూడా కష్టంగా మారింది.



ఔరంగాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో.. పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆంతరమ్ ఘాట్ వద్ద గేదెలను తీసుకెళ్తున్న ట్రక్కు..100 అడుగుల లోయలో పడిపోయింది. ట్రక్ డ్రైవర్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. జల్గావ్ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి అనేక వాహనాలు చిక్కుకుపోయాయి. కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. జల్గావ్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో.. ఇళ్లు, పంటలు నీట మునిగాయి. రహదారులు దెబ్బతిన్నాయి.




పాల్గఢ్ జిలాలోనూ వర్ష భీభత్సం కొనసాగుతోంది. తలసారి ప్రాంతంలో నీటి ప్రవాహంలో ముగ్గురు కొట్టుకుపోగా ఇద్దరిని స్థానికులు కాపాడారు. ముంబయిలో మంగళవారం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
ఇదీ చూడండి: Assam flood: వరద విలయం.. 5.74 లక్షలమందిపై ప్రభావం!