బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో ప్రధాని మోదీ వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా తొమ్మిది ఒప్పందాలపై సంతకం చేయనున్నారు. 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం సందర్భంగా నిలిచిపోయిన పురాతన హల్దీబరి-చిలాహటి రైల్వేలైన్‌ను తిరిగి ప్రారంభించనున్నారు.
నదీ జలాల పంపిణీ, కరోనా పోరులో సహకారం, సరిహద్దు హత్యలు, వర్తక అసమానతలు, కనెక్టివిటీ, రోహింగ్యాల సంక్షోభం వంటి సమస్యలు సమావేశంలో చర్చకు రానున్నట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ తెలిపారు. రెండు దేశాల్లో ప్రవహించే మోను, ముహురి, గోమతి, ధార్ల, దూద్కుమార్, ఫెనీ, తీస్తా నదుల సమస్యలను ఒకే ఫ్రేమ్‌వర్క్ కిందకు తీసుకొచ్చేందుకు ఈ భేటీలో ప్రయత్నించనున్నట్లు పేర్కొన్నారు.
కొవిడ్ సహకారంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు మోమెన్. బంగ్లాదేశ్‌కే తొలుత టీకా అందిస్తామని భారత్ ఇదివరకే హామీ ఇచ్చిందని చెప్పారు. ఐరాసలో రోహింగ్యాల సమస్యపై సహకరించాలని ప్రధాని మోదీని కోరనున్నట్లు పేర్కొన్నారు. 2021 మార్చి 26న జరిగే బంగ్లాదేశ్ 50 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యక్షంగా హాజరుకావాలని భారత ప్రధాని మోదీని కోరినట్లు వెల్లడించారు.