Haryana Road Accident : హరియాణాలోని సిర్సా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మరణించారు. దబ్వాలి సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిందీ దుర్ఘటన.
ప్రమాదంలో ప్రాణాలు విడిచివారు ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది. వారంతా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. హిసార్ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు. కారు బ్రేకులు ఫెయిలై ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
నలుగురు మృతి
ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అటవీ అధికారులు సహా నలుగురు ప్రాణాలు విడిచారు. మరో నలుగురు గాయపడ్డారు. రిషికేశ్‌లోని చిల్లా కాలువ వద్ద పెట్రోలింగ్‌కు వెళ్తున్న వాహనం చెట్టును ఢీకొట్టింది. సోమవారం జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు మరణించారు.
మృతులను శైలేశ్ గిల్డియాల్, ప్రమోద్ ధ్యాని, డ్రైవర్ సైఫ్ అలీఖాన్, కుల్‌రాజ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. శైలేశ్, ప్రమోద్ ఫారెస్ట్ రేంజర్లని చెప్పారు. అలోకీ దేవీ అనే మహిళ కాలువలో గల్లంతైందని పేర్కొన్నారు. నలుగురు క్షతగాత్రులను చికిత్స కోసం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించినట్లు వెల్లడించారు.
అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం
Assam Bus Accident : కొద్ది రోజుల క్రితం అసోంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. గోలాఘాట్ జిల్లాలోని దేర్గావ్ గ్రామంలో బస్సు, ట్రక్కు ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగింది. ఘటనలో మరో 30 మంది గాయపడ్డారు. బస్సులో 45 మంది ప్రయాణికులు పిక్నిక్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. ప్రమాదానికి గురైన లారీ బొగ్గు లోడుతో వెళ్తున్నట్లు చెప్పారు.
ఘటనాస్థలిలోనే 10 మంది చనిపోగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ నూర్ ఆలం హక్ సైతం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. 30 మంది క్షతగాత్రులు జొర్హాట్ బోధనాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అక్కడి సీనియర్ వైద్యుడు తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.