కర్నాల్‌లో రైతులపై జరిగిన లాఠీఛార్జ్(karnal farmers lathicharge) ఘటనపై జ్యుడీషియల్ విచారణకు హరియాణా ప్రభుత్వం ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకూ ఈ వివాదానికి కారణమైన కలెక్టర్ ఆయుష్ సిన్హాను సెలవులో పంపుతున్నట్లు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో.. కర్నాల్ జిల్లా కేంద్రంలో చేపట్టిన ఆందోళనలను(karnal farmers protest) విరమించారు రైతులు.
కర్షకులపై లాఠీఛార్జ్‌కు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తునకు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించనున్నట్లు హరియాణా అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దేవేందర్ సింగ్ వెల్లడించారు. నెలరోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
ఈ మేరకు హరియాణా ప్రభుత్వం, రైతు నేత గుర్నామ్ సింగ్ చదుని సంయుక్త ప్రకటన చేశారు. ప్రభుత్వంతో చర్చలు ఫలించిన క్రమంలో కర్నాల్ జిల్లా ప్రధాన కార్యాలయం ముందు చేపట్టిన నిరసనలను విరమిస్తున్నట్లు చెప్పారు చదుని.
10 మంది రైతులకు గాయాలు..
ఆగస్టు 28న కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులపై కర్నాల్‌లో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో10మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే హద్దుమీరితే రైతుల తలలు పగలకొట్టాలని పోలీసులను కర్నాల్ కలెక్టర్ ఆయుష్ సిన్హా ఆదేశించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో లాఠ్‌ఛార్జ్‌కి ప్రధాన కారణమైన కలెక్టర్‌ను సస్పెండ్ చేసి అతనిపై కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తోంది.
ఇదీ చూడండి: రైతుల నిరసన బాట- హరియాణాలో ఉద్రిక్తత