హరియాణాలోని ఎలెనాబాద్ 30న ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ పాల్గొన్నారు. హరియాణా భాజపా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పుకుని పోటీ చేస్తే 45 సీట్లు సాధించడం కూడా సందేహమేననే అభిప్రాయపడ్డారు. కార్యకర్తలంతా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తేనే విజయం సాధ్యమని స్పష్టం చేశారు.
"మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో భాజపా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మొదటిసారి 47, రెండోసారి 40 సీట్లు సాధించాం. మోదీ జీ పేరుతో మనం మూడోసారి 45 మార్కును దాటగలమా? ఎందుకంటే హరియాణాలో ఏదైనా పార్టీ మూడోసారి అధికారం చేపట్టదనే సంప్రదాయం ఉంది కదా?"
-రావు ఇందర్‌జిత్ సింగ్, కేంద్ర సహాయ మంత్రి
రాష్ట్ర భాజపా అధ్యక్షుడు ఓం ప్రకాశ్ ధన్కర్ ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంపై సలహాలు ఇస్తూ పై వ్యాఖ్యలు చేశారు ఇంద్రజిత్. "మోదీ.. రాష్ట్ర భాజపాకు మద్దతుగా ఉంటారు. కానీ ఈసారి మోదీ పేరు మీద మనకు ఓట్లు వస్తాయనే గ్యారెంటీ లేదు" అని వ్యాఖ్యానించారు.
"పెద్ద నేతలు వస్తారు. ప్రసంగాలు చేసి వెళ్తారు. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పనిచేయాలి. అప్పుడే వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే మోదీ కల నెరవేరుతుంది."
-రావు ఇందర్ జిత్ సింగ్
ఇవీ చదవండి: