కరోనా మహమ్మారి కారణంగా మిషన్ ఇంద్రధనుష్ ద్వారా కేంద్రం అందించే రోగ నిరోధక టీకాలకు దూరమైన చిన్నారులు, గర్భిణీలకు తిరిగి వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకాలు పొందని చిన్నారులు, గర్బిణీలకు రెండు రౌండ్లలో వ్యాక్సిన్ అందించనున్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ 'ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్(ఐఎమ్ఐ) 3.0' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
15 రోజుల వ్యవధిలో..
ఐఎమ్ఐ ద్వారా ముందుగానే గుర్తించిన దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 250 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 22, మార్చి 22 తేదీల్లో రెండు విడతల్లో టీకాల పంపిణీ ప్రక్రియ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత జిల్లాల్లో టీకాలు తీసుకోని చిన్నారులు, గర్భిణీలను గుర్తించి 15 రోజుల వ్యవధిలో రెండు వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు.
గతంలో..
2014లో మిషన్ ఇంద్రధనుష్ను ప్రారంభించింది కేంద్రం. గతంలో నిర్వహించిన తొలి రెండు దశల కార్యక్రమంలో భాగంగా.. దేశంలోని 690 జిల్లాల్లో టీకాలు పంపిణీ చేశారు. దీని ద్వారా ఆయా జిల్లాల్లోని 3.76 కోట్ల మంది చిన్నారులు, 94.6 లక్షల మంది గర్భిణీలకు వ్యాక్సిన్లు సరఫరా చేసింది కేంద్రం.
ఇదీ చదవండి: 'మంగళ్యాన్-2 సైతం ఒక ఆర్బిటరే'