Harish Rawat rebel: కాంగ్రెస్ నాయకత్వంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించి ఆ పార్టీలో అలజడి సృష్టించారు సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్. పార్టీ నేతలు తన చేతులను కట్టేశారని ఆరోపించారు. కొద్ది నెలల్లో జరగబోయే ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న తరుణంలో రావత్ ధిక్కరణ స్వరం కాంగ్రెస్‌కు తలనొప్పిలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ అధిష్ఠానం అప్రమత్తమైంది. సమస్యలపై చర్చించేందుకు దిల్లీకి రావాలని రావత్‌ను ఆహ్వానించింది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు రావత్ శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రావత్‌తో పాటు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ప్రీతమ్ సింగ్, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేశ్ గొడియాల్, పార్టీ సీనియర్ నేత యాశ్పాల్ ఆర్య సైతం దిల్లీకి వెళ్లనున్నారని పేర్కొన్నాయి.
బుధవారం వరుస ట్వీట్ల ద్వారా కాంగ్రెస్ నాయకత్వంపై హరీశ్ రావత్ విమర్శలు గుప్పించిన క్రమంలో.. దిల్లీలో భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ట్విట్టర్ వేదికగా విమర్శలు..
ఎన్నికలు అనే సముద్రంలో ఈదాల్సి ఉందని, అయితే చాలా చోట్ల పార్టీ మద్దతు తెలపాల్సింది పోయి.. వెన్నుచూపి నెగెటివ్ రోల్ పోషిస్తోందని వరుస ట్వీట్లు చేశారు హరీశ్ రావత్. 'అధికార పార్టీ చాలా మొసళ్లను సముద్రంలో వదిలింది. ఇప్పుడు.. నేను ఎవరినైతే అనుసరించాలో.. వారి అనుచరులే నా చేతులు, కాళ్లు కట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందనే ఆలోచనలతో నిండిపోయాను. నువ్వు చాలా కాలం ఈదుకొచ్చావు, ఇక చాలు హరీశ్ రావత్ అని నాలోని ఓ స్వరం చెబుతోంది. నేను సందిగ్ధంలో ఉన్నాను. నూతన సంవత్సరం నాకు మార్గాన్ని చూపుతుంది. ఈ పరిస్థితుల్లో కేదార్నాథుడు నాకు మార్గనిర్దేశం చేస్తాడనే నమ్మకం ఉంది.' అని పేర్కొన్నారు.
ఆ తర్వాత ట్వీట్ల అంశంపై విలేకరులు ప్రశ్నించగా.. సమయం వచ్చినప్పుడు తానే అన్ని చెబుతానని అన్నారు రావత్.
ఇదీ చూడండి: హరీశ్ రావత్ తిరుగుబాటు? తీవ్ర సంక్షోభంలోకి కాంగ్రెస్?