Hanuman Chalisa Row: హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టయిన అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులకు పెద్ద ఊరట లభించింది. నవనీత్, ఆమె భర్త రవి రాణాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ముంబయి సెషన్స్ కోర్టు.
బెయిల్పై ఉన్న సమయంలో మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడరాదని, కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదని స్పెషల్ జడ్జి ఆర్ఎన్ రోకడే స్పష్టం చేశారు. విచారణ సమయంలో పోలీసులకు సహకరించాలని అన్నారు. వారిని ప్రశ్నించాలనుకుంటే.. 24 గంటల ముందే నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించారు.

- రాణా దంపతులు బుధవారం సాయంత్రంకల్లా విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు వారి తరఫు న్యాయవాది రిజ్వాన్ మర్చంట్. అంతకుముందు నడుం నొప్పి కారణంగా.. జైలు నుంచి నవనీత్ రాణాను జేజే ఆస్పత్రికి తరలించారు.
ఇదీ జరిగింది: మహారాష్ట్ర సీఎం ఇంటి వద్ద తన భర్తతో కలిసి హనుమాన్ చాలీసా చదువుతానని ఎంపీ నవనీత్ రాణా గత నెలలో సవాల్ చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, అది గుర్తు చేసేందుకు హనుమాన్ చాలీసా చదువుతానని ఆమె అనడం శివసేన కార్యకర్తలను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో వారు ఏప్రిల్ 23న నవనీత్ రాణా ఇంటి వద్దకే వెళ్లారు. హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఆ తర్వాత నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ఇవీ చూడండి: జైల్లో తల్లిదండ్రులు.. విడుదల కావాలని హీరోయిన్ కుమార్తె పూజలు
''ఎస్సీ' అంటూ పోలీసులు తిట్టారు.. నీళ్లివ్వలేదు, బాత్రూమ్కు వెళ్లనివ్వలేదు'