ముంబయి మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే వల్ల మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి సమస్యలు ఎదురవుతాయని కొందరు నేతలను తానెప్పుడో హెచ్చరించినట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. 2004 నాటి ఘట్కోపర్ బాంబు పేలుళ్ల కేసులో సస్పెండైన సచిన్ వాజేను తిరిగి నియమించాలన్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించినట్లు ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్న వాజే ప్రవర్తన, పనితీరు ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టగలవని కొందరు నేతలకు ముందే తెలియజేసినట్లు వివరించారు. అయితే తాను ఆ నాయకుల పేర్లను వెల్లడించలేన్నారు సంజయ్.
''అనేక సంవత్సరాలుగా జర్నలిస్టుగా ఉన్నందువల్ల సచిన్ వాజే గురించి నాకు తెలుసు. ఏ వ్యక్తీ స్వతహాగా చెడ్డవాడు కాదు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల అలా మారాల్సి వస్తుంది. వాజే ఉదంతం, తాజా వివాదాలు.. సంకీర్ణ ప్రభుత్వానికి ఒక పాఠం నేర్పాయి.''
-సంజయ్ రౌత్, శివసేన ఎంపీ.
ఆ ఉద్దేశం లేదు..
సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు వాజే కార్యకలాపాల గురించి సరైన సమాచారం లేదని.. అందుకే సస్పెండ్ అయిన పోలీసు అధికారికి మద్దతుగా నిలిచారని రౌత్ తెలిపారు. అంతేగాని వాజేను కాపాడటానికి సీఎం ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. వాజే ఉదంతం మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి మంచి పాఠం నేర్పిందన్నారు.
రహస్య భేటీపై..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య రహస్య భేటీ జరిగిందన్న వార్తలపై స్పందించిన రౌత్.. ప్రతిపక్ష నేతల మధ్య సమావేశాలు మంచివేనని తెలిపారు. అదొక రహస్య సమావేశమే అయితే.. దాని గురించిన వార్తలు బయటకు ఎలా వస్తాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బంగాల్, తమిళనాడు సహా.. ఇతర రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో మహారాష్ట్ర సంకీర్ణ సర్కారు ప్రభావితం కాదని స్పష్టం చేశారు.
జెంటిల్మెన్..
ఇక హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ 'యాక్సిడెంటల్ హోంమంత్రి' వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ఆయన ఒక జెంటిల్‌మన్ అని వ్యాఖ్యానించారు. హోం మంత్రి వంటి కీలకమైన పదవి నిర్వహణలో అనిల్ ఇబ్బందులు, ఒత్తిడి ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ స్థానంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అతనికి తెలిపినట్లు చెప్పారు.
ఇవీ చదవండి: విశ్రాంత జడ్జితో 'మహా' హోంమంత్రిపై విచారణ!