Gurpatwant Singh Pannun Parliament Attack Video : పార్లమెంట్ భవనంపై దాడి చేస్తానని బెదిరించాడు ఖలీస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(SFJ) నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ. 2001లో పార్లమెంట్‌పై దాడి చేసిన రోజైన డిసెంబర్ 13న లేదా అంతకన్నాముందే ఈ దాడికి పాల్పడుతానంటూ వీడియోను విడుదల చేశాడు. గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేయడానికి కుట్రలు జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలోనే ఈ వీడియో రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వీడియోలో 2001 పార్లమెంట్ దాడికి సూత్రధారి అయిన అఫ్జల్ గురు ఫొటోతో పాటు దిల్లీ బనేగా ఖలిస్థానీ (దిల్లీని ఖలిస్థానీగా మారుస్తాం) అనే నినాదం ఉన్న పోస్టర్‌ను పట్టుకున్నాడు పన్నూ. తనను హత్య చేయడానికి భారత సంస్థలు చేసిన కుట్రలు విఫలమయ్యాయని అందులో పేర్కొన్నాడు. తనపై కుట్రలకు సమాధానంగా డిసెంబర్ 13కు ముందు పార్లమెంట్‌పై దాడి చేస్తానని తెలిపారు. పన్నూ బెదిరింపు వీడియో బయటకు రావడం వల్ల కేంద్ర నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరగ్గా, ఈ ఏడాదితో 22 ఏళ్లు పూర్తి కానున్నాయి. మరోవైపు, ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు పన్నూ. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 22 వరకు జరగనున్నాయి.
పన్నూ హత్యకు కుట్ర
అంతకుముందు, గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు అమెరికాలో కుట్ర జరిగిందంటూ పశ్చిమ దేశాల పత్రికలు గత నెలలోనే కథనాలు వెలువరించాయి. ఆ కుట్రను తాము భగ్నం చేశామని అగ్రరాజ్యం వెల్లడించినట్లు వాటిల్లో పేర్కొన్నాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారులు భారత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చారు. అగ్రరాజ్యంలోనే గురుపత్వంత్ సింగ్ పన్నూను చంపేందుకు చేసిన ప్రయత్నాలను తాము భగ్నం చేశామని అమెరికా వెల్లడించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఈ హత్య కుట్రలో భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తా అనే వ్యక్తి ప్రమేయం ఉందంటూ అమెరికా అటార్నీ కార్యాలయం ఆరోపించింది. 'సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని బహిరంగంగా ప్రచారం చేసే భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడిపై న్యూయార్క్‌లో హత్యకు కుట్ర పన్నారు. దీనికి సంబంధించి నిందితుడికి భారత్ నుంచి ఆదేశాలు అందాయి' అని యూఎస్ జస్టిస్ విభాగం ఆరోపించింది. అయితే, ఈ అభియోగ పత్రాల్లో పన్నూ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.
'ఆ తేదీన విమానాల్లో ప్రయాణిస్తే ప్రమాదమే'- గురుపత్వంత్ మరోసారి వార్నింగ్