Ram rahim singh release: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌధ అధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్(డేరా బాబా) జైలు నుంచి విడుదల కానున్నారు. హరియాణా రోహ్తక్ జిల్లాలోని సునారియా జైలులో ఉన్న ఆయనకు మూడు వారాల సెలవులు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు.
Ram rahim singh Parole:
పంజాబ్ ఎన్నికలకు 13 రోజుల ముందు ఈ సెలవులు మంజూరు కావడం గమనార్హం. హరియాణాలోని సిర్సాలో డేరా ఆశ్రమం ఉంది. ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. డేరా బాబాకు పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో అనుచరులు ఉన్నారు. అనేక రాజకీయ సమీకరణాలు డేరా బాబాతో ముడిపడి ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Dera baba punjab election
అయితే, ఎన్నికలకు ముందు ఆయన విడుదల కావడం యాదృచ్ఛికమేనని హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. మూడేళ్ల జైలు శిక్ష తర్వాత ఎవరికైనా సెలవులు లభిస్తాయని చెప్పారు. డేరా బాబా విడుదల ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
Ram rahim singh cases:
54 ఏళ్ల డేరా బాబా.. తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన నేరానికి 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పంచకులలోని ప్రత్యేక సీబీఐ కోర్టు 2017 ఆగస్టులో ఆయనను దోషిగా తేల్చింది. దీంతో పాటు, 2019లో జర్నలిస్టు రామ్‌చంద్ర ఛత్రపతి, 2021లో డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్యల కేసుల్లో ఆయనకు రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి.
సోమవారమే ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైలు వైపు వెళ్లే వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. సరైన కారణాలు లేనిదే జైలు లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు.
డేరా బాబా సెలవుపై బయటకు రావడం ఇదే తొలిసారేం కాదు. వైద్య చికిత్స కోసం రెండు సార్లు, అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కలిసేందుకు ఒకసారి ఆయన పెరోల్‌పై బయటకు వచ్చారు.
ఇదీ చదవండి: జడ్ కేటగిరీ భద్రత స్వీకరించండి.. ఒవైసీకి షా విజ్ఞప్తి