10 నెలల గర్భంతో ఉన్న ఏనుగును తుపాకీతో కాల్చి చంపిన ఘటన కర్ణాటక కొడగు జిల్లాలోని కుశాలనగర్‌లో వెలుగు చూసింది. ఆహార అన్వేషణలో భాగంగా అడవి నుంచి వచ్చిన 20 ఏళ్ల ఏనుగును రసూల్‌పుర్, బాలుగోడు ప్రాంతంలో ఆగంతకులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిర్వహించిన పశువైద్యులు మృతి చెందిన ఏనుగు కడుపులో మగ పిండం ఉన్నట్లు తెలిపారు.
రసూల్‌పుర్, బాలుగోడు ప్రాంతాల్లో ఆహారం కోసం ఏనుగులు పొలాల్లోకి ప్రవేశించి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రజలపై దాడులు చేసిన సంఘటనలు కూడా అనేకం వెలుగు చూశాయి. దీంతో రైతులు, అటవీశాఖ అధికారులు కలిసి సోలార్ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశారు. కంచె నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల అడవి ఏనుగులు పొలాలు, తోటల్లోకి సులభంగా ప్రవేశిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాఫీ తోటలోకి ప్రవేశించిన ఏనుగును కాల్చి చంపి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. గర్భంతో ఉన్న గజరాజు మృతి పట్ల స్థానికులు విషాదం వ్యక్తం చేస్తున్నారు. నెలలు కూడా నిండని ఏనుగు పిల్ల కడుపులోనే చనిపోవడం పట్ల అక్కడి ప్రజలు కంటతడి పెట్టుకున్నారు.
తల్లి ఏనుగు చనిపోయిందని తెలియక..!
ఇటీవలె తమిళనాడులో ఓ తల్లి ఏనుగు పంట పొలాల చుట్టూ అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి ప్రాణాలు కోల్పొయింది. తల్లి ఏనుగు ప్రాణాలు కోల్పోయిందన్న విషయం తెలియక దాని రెండు పిల్ల ఏనుగులు దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి ఏనుగును వెత్తుకుంటూ బిక్కుబిక్కుమంటూ అడవిలోనే తిరుగుతూ కనిపించాయి. ఈ సన్నివేశం.. అక్కడి గ్రామస్థులను కంటతడి పెట్టించింది. తమ తల్లి ఇంకా బతికే ఉందని రోజూ అవి వెళ్లిన చోటకి వెళ్లి వాటి మాతృమూర్తి కోసం అన్వేషిస్తున్నాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు.. ఆ ఏనుగు పిల్లలను ఏం చేశారో తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
నీటి గుంతలో పిల్ల ఏనుగు మృతి!
కొద్దిరోజుల క్రితం కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఓ పిల్ల ఏనుగు.. రాళ్ల వాగు నీటి గుంతలో పడి మృతి చెందింది. గుంతలో పడి ఉన్న ఏనుగు పిల్ల మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. ఏనుగు పిల్లను బయటకు తీశారు. బుల్లి గజరాజు నీరు తాగేందుకు ప్రయత్నించి నీటి గుంతలో జారిపడి ఉండొచ్చని చెప్పారు. ఆ ఏనుగు పిల్ల గత కొన్ని రోజులుగా అదే ప్రాంతంలో సంచరించినట్లు స్థానికులు తెలిపారు. పంట పొలాలకు సమీపంలో తిరిగినా సరే.. దీని వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం కలగలేదని వారు వెల్లడించారు. ఈ మృతికి సంబంధించిన వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.