Nose Typing Phone : శారీరక వైకల్యాన్ని కారణంగా చూపుతూ ఏ పని చేయకుండా ఖాళీగా ఉండిపోలేదు ఆ యువకుడు. సవాళ్లను అధిగమించి సత్తా చాటాలని అనుకున్నాడు. ఆ సంకల్పంతోనే రికార్డు కొల్లగొట్టాడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన స్మిత్ చాంగెలా. చిన్నప్పటి నుంచి న్యూరోపతితో బాధపడుతున్న అతడు.. ముక్కుతో ఫోన్లో టైప్ చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. అనుకున్నది సాధించాలనే తపన ఉంటే వైకల్యం ఎన్నటికీ అడ్డురాదని నిరూపించాడు స్మిత్.
కరోనా లాక్డౌన్ సమయంలో..
రాజ్‌కోట్‌లో నివాసం ఉంటున్న స్మిత్ చాంగెలా అనే యువకుడు.. చిన్నప్పటి నుంచి న్యూరోపతి (నరాలకు వచ్చే వ్యాధి)తో బాధపడుతున్నాడు. అందువల్ల అతడు మొబైల్‌లో చేత్తో టైప్ చేస్తుంటే నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కరోనా లాక్డౌన్ సమయంలో అతడు.. ముక్కుతో ఫోన్లో టైపింగ్ చేయడం ప్రారంభించాడు. మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా.. ఇప్పుడు వేగంగా టైప్ చేస్తున్నాడు.
"నేను నా ముక్కు కొనతో మొబైల్‌లో టైప్ చేస్తాను. ప్రస్తుతం ఎంతో వేగంగా టైప్ చేస్తున్నాను. చేత్తో టైప్ చేస్తున్నానో లేకో ముక్కుతో అనేది ఎదుట వ్యక్తి పోల్చకోలేనంత వేగంగా టైపింగ్ చేస్తున్నాను. కరోనా సమయంలో ముక్కుతో టైప్ చేయడం ప్రారంభించాను. అందరిలా చేతితో టైప్ చేయడం వల్ల నా చేతుల నొప్పులు మొదలయ్యాయి. అందుకే ముక్కు కొనతో టైప్ చేయడం మొదలుపెట్టాను."
- స్మిత్ చాంగెలా
ఎందరికో ఆదర్శంగా..
ఇటీవలే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నట్లు స్మిత్ చాంగెలా చెప్పాడు. నిమిషంలో 151 అక్షరాలు/ 36 పదాలు టైప్ చేశానని చెప్పాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గుర్తింపు పత్రం కూడా అందుకున్నట్లు తెలిపాడు. "నాలాంటి దివ్యాంగ యువకులు దేశంలో ఎంత మందో ఉన్నారు. వారు కూడా జీవితంలో ఎక్కడో ఒక చోట ఒత్తిడికి లోనవుతారు. అప్పుడు వారేం పనిచేయలేక బాధపడుతుంటారు. అలా కాకుండా ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలి. వినూత్నంగా ఆలోచించి విజయం సాధించాలి" అంటూ స్మిత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బీకాం చదువుతూ యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న అతడు.. ఎందరో యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.