Gujarat drugs seized: గుజరాత్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. సముద్ర తీరంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. మొత్తం రూ.400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Drugs in Pak boat
డ్రగ్స్ సమాచారంతో భారత తీర రక్షణదళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. పాకిస్థాన్‌కు చెందిన పడవలో హెరాయిన్‌ను తరలిస్తున్నట్లు గుర్తించాయి. భారత జలాల్లోకి పడవ ప్రవేశించగానే వెంబడించి నిలిపివేశాయి. అందులోని 77 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేశారు. పడవలో ప్రయాణిస్తున్న ఆరుగురిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. కచ్ జిల్లాలోని జఖావు తీరానికి పాకిస్థాన్ పడవను తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
వరుసగా ఎన్నో ఘటనలు..
ఇటీవలి కాలంలో గుజరాత్లో వరుసగా మాదకద్రవ్యాలు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కోస్ట్‌గార్డ్, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో.. 30 కేజీల హెరాయిన్‌ను సీజ్ చేశారు. పాకిస్థాన్ జాతీయులు రవాణా చేస్తున్న ఈ డ్రగ్స్ విలువ రూ.150 కోట్లుగా లెక్కతేలింది. నవంబర్‌లో మోర్బి జిల్లాలో రూ. 600 కోట్ల డ్రగ్స్ బయటపడ్డాయి. వీటిని సైతం పాకిస్థాన్ డ్రగ్ డీలర్లే పంపినట్లు అధికారులు గుర్తించారు.
మరోవైపు, సెప్టెంబర్‌లో ముంద్రా పోర్టులో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుపడ్డాయి. రూ.21 వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలు అదానీకి చెందిన నౌకాశ్రయంలో సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి మాదకద్రవ్యాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇదీ చదవండి: శక్తివంతమైన వ్యాక్సిన్ దిశగా శాస్త్రవేత్తల ముందడుగు