కంచుకోటలో కమలం మళ్లీ వికసించింది. గుజరాత్లో వరుసగా ఏడోసారి భాజపా విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఫలితాలను సాధించింది. గుజరాత్లో భాజపా విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.
గుజరాత్ ఎన్నికల్లో భాజపా ఘనవిజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పార్టీ కార్యకర్తలను ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'గుజరాత్ ప్రజలు అభివృద్ధి రాజకీయాలను ఆశీర్వదించారు. మా పార్టీకి నిజమైన బలం కార్యకర్తలే.. వారి అసాధారణమైన కృషి లేకుండా ఈ చరిత్రాత్మక విజయం ఎప్పటికీ సాధ్యం కాదు. హిమాచల్ ప్రజలు భాజపా పట్ల చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. ప్రజా సమస్యలను లేవనెత్తడానికి మేము నిరంతరం కృషి చేస్తాం' అని మోదీ ట్వీట్ చేశారు.
"బూటకపు వాగ్దానాలు, ఉచితాలు, బుజ్జగింపుల రాజకీయాలు చేసే వారికి గుజరాత్ ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంతటి చారిత్రక విజయం అందించిన ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. ఈ విజయం నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిపై ప్రజలకున్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. మోదీ నాయకత్వంలోని భాజపా గత రెండున్నర దశాబ్దాల రికార్డ్‌ను బద్దలుకొట్టింది. మహిళలు, యువత, రైతులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు భాజపాను ఆశీర్వదించారు."
--అమిత్ షా కేంద్ర హోం మంత్రి
కాంగ్రెస్‌కు ఇంతటి విజయాన్ని అందించిన హిమాచల్‌ప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం. పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ అభినందనలు. కాంగ్రెస్ విజయంలో క్రెడిట్ కార్యకర్తలు, నాయకులదే.
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
వచ్చే ఎన్నికల్లో విజయం మాదే..
గుజరాత్ ప్రజలకు ఆప్ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో భాజపా కంచుకోటను బద్దలుకొట్టి విజయం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు.'ఆప్ జాతీయ పార్టీ హోదాను పొందేందుకు మాకు సాయపడిన గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు. ప్రచార సమయంలో తమ పార్టీ, నాయకులు ఎప్పుడూ దుర్వినియోగానికి పాల్పడలేదు' అని కేజ్రీవాల్ తెలిపారు.
పార్టీపై ప్రజల్లో అపారమైన విశ్వాసం..
ప్రజలకు భాజపాపై అపారమైన విశ్వాసం ఉందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. అందుకే రికార్డు స్థాయి విజయాన్ని పార్టీకి అందించారని ఆయన తెలిపారు.
ఆప్, భాజపాకు రహస్య అవగాహన..
"గుజరాత్లో ఎన్నికల్లో భాజపా అద్భుత ప్రదర్శన చేసింది. ఫలితాలు ఊహించిన రీతిలోనే ఉన్నాయి. భాజపాకు, ఆమ్ఆద్మీ పార్టీకి మధ్య రహస్య అవగాహన ఉందేమోనని అనుమానంగా కలుగుతోంది" అని వ్యాఖ్యానించారు శివసేన(ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్ రౌత్.
కాంగ్రెస్ స్పందన..
గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు, ఎన్నికల ఫలితాలకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, గుజరాత్లో భాజపాకు గట్టి పోటీదారుగా నిలిచామని తెలిపింది.