గుజరాత్లోని ఓ ప్రభుత్వాసుపత్రిలో అమానవీయ ఘటన జరిగింది. రోగిని అనుక్షణం కనిపెట్టుకొని ఉండాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రోగి ముఖంపై చీమలు పాకుతున్నా పట్టించుకున్న వారు లేరు. ఇందుకు సంబంధించిన వీడియోను రోగి భర్త సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది..
కొవిడ్ సోకిన ఓ మహిళ వడోదరాలోని సర్ సాయజీరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉన్న ఆమెను పరామర్శించడానికి వెళ్లిన భర్తకు అక్కడి పరిస్థితి చూసి నోట మాట రాలేదు. పక్షవాతంతో పడి ఉన్న ఆ కొవిడ్ రోగి ముఖాన చీమలు పాకుతున్నాయి. చీమలు విపరీతంగా కుట్టడం వల్ల ఆమె ముఖమంతా వాచి పోయింది.
భార్య పరిస్థితిపై అక్కడున్న వైద్య సిబ్బందికి సమాచారం అందించగా.. తాము అంతకుముందు రోజే రోగి నోటిని శుభ్రం చేశామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను రోగి భర్త సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు.
రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ రంజన్ అయ్యర్ తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.
ఇదీ చదవండి : 2.27 లక్షల మంది గర్భిణీలకు టీకా తొలి డోసు