సింహాలను భయపెట్టిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గుజరాత్ జూనాగఢ్‌లో జరిగింది.
ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు.. రెండు సింహాలను తరుముతున్న వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. హారన్ కొడుతూ,పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ వాటిని ఆ ఇరువురూ భయపెట్టారు.
ఈ వీడియో ఆధారంగా అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. గిర్ తూర్పు అటవీ డివిజన్లోని తులసీశ్యామ్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుసుకున్నారు. నిందితుల్లో ఒకరిని సరాసియా గ్రామానికి చెందిన యునిస్ పఠాన్‌గా గుర్తించగా.. మరొక మైనర్ ఉన్నాడు. వారిద్దరిపై అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. పఠాన్‌ను స్థానిక కోర్టు ముందు హాజరు పరిచారు. మైనర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వన్యప్రాణులను హింసిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ, వన్యప్రాణుల సంరక్షణ శాఖ ముఖ్య అధికారి డీటీ వాసవాద హెచ్చరించారు. ఇలాంటి నేరాల్లో 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష, రూ.25,000 జరిమానా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలెవరూ ఈ తరహా హింసలకు పాల్పడవద్దని సూచించారు.
ఇదీ చూడండి:పదేళ్ల బాలికతో తాంత్రికుడు సజీవ దహనం