జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ వాటిని హింసించే వారికి ఇకపై భారీ జరిమానా విధించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. జైలు శిక్ష కూడా విధించే దిశగా ప్రస్తుత చట్టంలో మార్పులు చేయనుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును కేంద్రం తీసుకురానుంది. జంతువులపై క్రూరత్వ నివారణ (పీసీఏ) చట్టం- 1960 కింద తొలిసారి జంతు హింసకు పాల్పడేవారికి కేవలం రూ.50 మాత్రమే జరిమానాగా విధిస్తున్నారు. దీన్ని పెంచాలని కేంద్రం యోచిస్తోంది.
ప్రపంచ జంతు దినోత్సవాన్ని పురస్కరించుకుని గురుగ్రామ్‌లో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంతు హింసకు సంబంధించి త్వరలోనే ఓ బిల్లు తీసుకురానున్నట్లు చెప్పారు. ఇందుకోసం కేబినెట్ ఆమోదం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న జరిమానా పెంచాలని, జైలు శిక్ష కూడా విధించాలని తాము సిఫార్సు చేసినట్లు ఆ శాఖ కార్యదర్శి ఓపీ చౌదరి తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా జంతు సంక్షేమం చూసుకోవడానికి, షూటింగుల్లో జంతువుల వినియోగానికి అనుమతిచ్చేందుకు ఉద్దేశించిన జంతు సంక్షేమ బోర్డు పోర్టల్‌ను కేంద్రమంత్రి ఆవిష్కరించారు. నగరాల వెలుపల ఆవులకు హాస్టళ్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అపార్ట్‌మెంట్లలో నివసించే వారు వాటిని కొనుగోలు చేసి గోవులను హాస్టళ్లలో ఉంచొచ్చని చెప్పారు. గో ఆధారిత ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చని ప్రజలకు సూచించారు.
ఇవీ చదవండి: