కొవిడ్‌తో మృతిచెందిన వారి పిల్లలకు పునరావాసం కల్పించేందుకు కొత్త విధివిధానాల్ని రూపొందించింది కేంద్రం. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను దత్తతకు ఇస్తున్నారనే అసత్య ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వేళ.. మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ మేరకు బహిరంగ నోటీసులిచ్చింది. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అలాంటి చర్యల్లో పాల్గొనడం లేదా వాటికి సహకరించడం మానేయాలని ప్రజలకు సూచించింది. బాధిత చిన్నారులను 24 గంటల్లోగా.. స్థానిక జిల్లా శిశు సంక్షేమ కమిటీ(సీడబ్ల్యూసీ) ఎదుట హాజరు పరచాలని స్పష్టం చేసింది.
"సీడబ్ల్యూసీ.. పిల్లల తక్షణ అవసరాన్ని గుర్తించి.. వారి పునరావాసం కోసం అవసరమైన చర్యలు చేపడుతుంది. అలాంటి పిల్లలకు సంరక్షకులను ఏర్పాటుచేయడం లేదా వారిని సంరక్షణ సంస్థలో ఉంచడం వంటివి చేస్తుంది." అని తన ఆదేశాల్లో పేర్కొంది మహిళ, శిశు సంక్షేమ శాఖ.
గుర్తింపును కాపాడేలా..
ఇలా.. బాధిత పిల్లలకు చట్టం నిర్దేశించిన విధంగా.. వారి పరిసరాల్లో భద్రతను పెంచడం సహా.. సాధ్యమైనంతవరకు వారిని కుటుంబ, సమాజ వాతావరణంలో పెరిగేందుకు కృషి చేస్తామని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. ఒకవేళ.. బాధిత పిల్లలు బంధువుల సంరక్షణలో ఉన్నట్లయితే.. వారి శ్రేయస్సు గురించి సీడబ్ల్యూసీ నిరంతరం ఆరా తీస్తుందని తెలిపింది. అలాంటివారికి ఎల్లప్పుడూ తగిన మార్గనిర్దేశం చేస్తూ.. వారి గుర్తింపును కాపాడేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్నిరకాల చర్యలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్టు కేంద్రం వెల్లడించింది.
కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని తమతో పంచుకునేందుకు 1098 నంబర్‌కు సంప్రదించాలని కేంద్రం సూచించింది.
అనాథ పిల్లలను దత్తత తీసుకోదలచిన వారు చట్టబద్ధమైన నియమాలను అనుసరించేందుకు.. అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(cara.nic.in)ను సంప్రదించాలని పేర్కొంది.
ఇదీ చదవండి: 'వైరస్ నుంచి కోలుకున్నా.. ఇంటికి వెళ్లను'