Visakha Steel Plant Bids: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో వర్కింగ్ కేపిటల్, ముడి సరకు భాగస్వామ్యం కోసం.. ఎక్స్‌ప్రెషన్ ఆప్ ఇంట్రెస్ట్ కోసం 22మంది బిడ్లు దాఖలు చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా బిడ్ వేశారు. మరోవైపు..బిడ్ల దాఖలు గడువును ఆర్‌ఐఎన్‌ఎల్ సంస్థ 5 రోజులు పొడిగించింది.
విశాఖ ఉక్కు పరిశ్రమ వర్కింగ్ కేపిటల్, ముడిసరకు సరఫరా కోసం స్టీల్ వ్యాపారంలోగాని.. స్టీల్ తయారీకి వినియోగించే ముడి సరకు వ్యాపారంలో ఉన్నవారి నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ మార్చి 27న విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి ఓ ప్రకటన ఇచ్చింది. శనివారం (15వ తేదీ) మధ్యాహ్నం 3 గంటల వరకూ గడువు విధించింది. బిడ్లను నేరుగా గాని.., మెయిల్ ద్వారా గాని పంపేందుకు అవకాశం కల్పించారు. విశాఖ ఉక్కుకి మంచి భాగస్వామిగా ఒకటి లేదా రెండు ముడి సరకులు కుకింగ్ కోల్, బ్లాస్ట్ ఫర్నేస్ కోక్, ముడి ఇనుము సరఫరా, తయారీ వ్యాపారంలో ఉన్నవారి కోసం ఎదురు చూస్తున్నట్టు స్టీల్‌ప్లాంట్ ప్రకటనలో వివరించింది. దీనికి స్పందనగా.. 22 మంది ఆసక్తి వ్యక్తికరణ తెలుపుతూ బిడ్లు దాఖలు చేశారు.
సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ కూడా.. బిడ్ వేశారు. విశాఖ స్టీల్‌ఫ్లాంట్ సీజీఎం మార్కెటింగ్ సత్యానంద్‌కి స్వయంగా బిడ్డింగ్ పత్రాలు అందజేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ తెలుగువారందరికి బిడ్డ లాంటిదని..అందుకే బిడ్ దాఖలు చేశామని లక్ష్మీనారాయణ తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం మనందరి బాధ్యతని అందుకే ఓ ప్రైవేటు కంపెనీ తరుఫున బిడ్ వేసినట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు.. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్న గడువును రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL పొడిగించింది. బిడ్ల దాఖలుకు మరో 5 రోజులు అవకాశం కల్పించింది.
తెలుగువారందరం స్టీల్‌ప్లాంట్‌ను బిడ్డలా చూస్తున్నాం. అందుకే ప్లాంట్‌ను కాపాడుకున్నే ప్రయత్నం చేస్తున్నాం. స్టీల్‌ప్లాంట్ వాళ్లు వెల్లడించిన ప్రకారం మేము బిడ్డింగ్ వేశాం. ఈ బిడ్డింగ్ కోసం మేము ఏం చేయగలము అనే నిషయాలు ఇందులో పొందుపరిచాం. ప్రభుత్వం క్లీన్ షేవ్ పాలసీని పాటిస్తోంది. మేము క్లియర్ సేవ్ పాలసీని పాటిస్తున్నాం. స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వ రంగసంస్థగానే ఉండాలనుకుంటున్నాం ఉండాలనేదే మా అందరి కోరిక.'- లక్ష్మీనారాయణ, సీబిఐ పూర్వ జెడి
ఇప్పటివరకు ఈవోఐకు 6 విదేశీ సంస్థలు బిడ్డింగ్ వేసినట్లు సమాచారం అందుతోంది. ఈ బిడ్డింగ్‌లో ప్రక్రియలో ఉక్రెయిన్ నుంచి ఓ వ్యక్తి పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో జేఎస్‌డబ్ల్యూ, జేఎస్‌పీఎల్ సంస్థలతోపాటుగా... శాఖ నుంచి సైతం పలు సంస్థలు బిడ్డింగ్ దాఖలు చేసినట్లు సమాచారం అందుతోంది. సింగరేణి కాలరీస్ నుంచి ఇంకా బిడ్ దాఖలు కాలేదు. సింగరేణి బిడ్ వేసేందుకు మరికొంత సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: