కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల పరిధిలో పనిచేసే పొరుగుసేవల, ఒప్పంద ఉద్యోగులకు కేంద్ర ఆర్థికశాఖ వెసులుబాటు కల్పించింది. స్థానికంగా విధించిన లాక్డౌన్ల కారణంగా కార్యాలయాలకు రాలేక ఇళ్లకే పరిమితమైనవారిని విధుల్లో ఉన్నట్లు (ఆన్‌డ్యూటీ కింద) పరిగణించి నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి జీతభత్యాలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
"ఏప్రిల్ నెల మధ్య నుంచి మొదలై ఇప్పటివరకు కొనసాగుతున్న కొవిడ్ రెండో ఉద్ధృతి ఎంతోమందిపై ప్రభావం చూపింది. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు భిన్నంగా ఆంక్షలు విధించాయి. దానివల్ల ఎంతోమంది కాంట్రాక్టు, రోజువారీ, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇలాంటప్పుడు వారి వేతనాల్లో కోత పడుతుంది. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో అలాంటి వారు ఇంటికే పరిమితమైన కాలాన్ని ఆన్‌డ్యూటీ కింద పరిగణించి నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించాలని నిర్ణయించాం. ఈ వెసులుబాటు ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు వర్తిస్తుంది" అని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది.