ప్రపంచవ్యాప్తంగా 5జీ సేవలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం గేర్ల తయారీలో భారత్‌ను ప్రపంచ స్థాయిలో నిలిపే దిశగా 12వేల195 కోట్ల రూపాయల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలు వల్ల టెలికాం గేర్ల తయారీలో వచ్చే అయిదేళ్లలో 2లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు సహా వాటి తయారీ విలువ 2లక్షల 40వేల కోట్ల రూపాయలకు పెరిగేందుకు సాయం లభించనుంది.
3వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలకు ఈ పథకం అవకాశం కల్పిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం 2021 ఏప్రిల్ 1 నుంచి అమలు కానుంది. ఈ పథకం అమలుకు సూక్ష్మ, మధ్య, చిన్న తరహా రంగంలో కనీసం కనీస పెట్టుబడి అర్హత 10కోట్ల రూపాయలు, ఇతరులకు వంద కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. టెలికాం గేర్ల తయారీలో అమలు చేసే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
భారత్-మారిషస్ ఒప్పందానికి ఆమోదం..
భారత్-మారిషస్ మధ్య సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఇరుదేశాల స్వేచ్ఛా వాణిజ్యానికి మార్గం సుగమంకానుంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే సుమారు 310 వస్తువులను భారత్ ఎగుమతి చేయనుంది. వీటిలో ఆహార పదార్థాలు, వ్యవసాయోత్పత్తులు,లోహాలు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి.
జువైనల్ చట్టంలో సవరణలుకు 'ఓకే'..
జువైనెల్ చట్టంలో కీలక సవరణలకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇకపై జిల్లా న్యాయాధికారుల పాత్రను పెంచుతూ... చట్టంలో సవరణలకు అంగీకారం తెలిపింది. ఈ చట్ట సవరణలు అమలులోకి వస్తే...సంబంధిత ఏజెన్సీల విధులను జిల్లా మెజిస్ట్రేట్లే పర్యవేక్షించే అధికారం లభిస్తోంది. వీరి ఆధ్వర్యంలోనే జిల్లాలోని పిల్లల సంరక్షణ విభాగం కూడా పనిచేస్తుంది.