పటిష్ఠ భద్రత, కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ బంగారం అక్రమరవాణా అదుపులోకి రావడం లేదు. దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులు అనేక రకాలుగా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(IGI) వెలుగుచూసిన అక్రమరవాణా ఉదంతాన్ని చూసి అధికారులే విస్తుపోయారు.
ఇదీ జరిగింది..
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు ఉజ్బెకిస్థాన్ పౌరులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని తనిఖీ చేయగా.. బంగారాన్ని నోటిలోని పళ్ల రూపంలో అమర్చుకుని వచ్చినట్లు గుర్తించారు. అలాగే ఒకరి గొంతులో బంగారు గొలుసును దాచి అక్రమ రవాణా చేస్తున్నట్లు నిర్ధరించారు. 'ఈ తరహా స్మగ్లింగ్ చేయడం చూసి విస్తుపోయినట్లు' ఓ అధికారి తెలిపారు.
ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(AIU) సోదాల్లో మొత్తం 951 గ్రాముల బంగారం బయటపడింది. ఆగస్టు 28 రాత్రి జరిగిన ఈ సోదాల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు దిల్లీ కస్టమ్స్ జోన్ అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి: