నూతన సంవత్సరం సందర్భంగా మహారాష్ట్రలోని శిర్డీకి భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి సాయినాథుడ్ని దర్శించుకున్నారు. అలాగే ఆదివారం కూడా శిర్డీసాయిని దర్శించుకునేందుకు భక్తులు లైన్లలో వేచి ఉన్నారు. భక్తుల దర్శనం కోసం శనివారం రాత్రంతా ఆలయాన్ని తెరిచి ఉంచారు. అలాగే సాయినాథుని దేవాలయంతో పాటు చుట్టుపక్కల ఉన్న ద్వారకామయి, చావడీ, ఖండోబా ఆలయాలను భక్తులు దర్శించుకున్నారు.

ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన రాజా దత్తా, శివాని దంపతులు రూ.46 లక్షల డబ్బై వేలు విలువ చేసే 928 గ్రాముల బంగారు కిరీటాన్ని శిర్డీసాయి సంస్థాన్‌కు అందించారు. హారతి సమయంలో సాయిబాబాకు కొత్త కిరీటాలు పెడుతుంటారు. తొలినాళ్లలో బాబాకు వెండి కిరీటాలు అధికంగా వచ్చేవి. అనంతరం బంగారు కిరీటాలను దానం చేయడం పెరిగింది.