Mahua Moitra TMC Party: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ మహువా మొయిత్రా గుడ్‌బై చెప్పనున్నారా..? మహువా, పార్టీ మధ్య తాజాగా జరిగిన పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను అన్‌ఫాలో చేయడం ఈ వార్తలకు కారణంగా కనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..?

Mahua Moitra Kaali Poster Row: మంగళవారం జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మహువా మతపరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలై తన తాజా చిత్రం 'కాళీ'కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. దానిపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. వాటిపై తీవ్ర విమర్శలకు వ్యక్తం అయ్యాయి. సొంత పార్టీ కూడా ఆమె మాటలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటితో తమకూ ఏ సంబంధం లేదంటూ దూరం జరిగింది.

'చర్చా కార్యక్రమంలో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయం పూర్తిగా ఆమె వ్యక్తిగతం. దానికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. తృణమూల్ కాంగ్రెస్ ఆ తరహా వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తోంది' అంటూ పార్టీ ట్వీట్ చేసింది. ఈ క్రమంలోనే పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను ఆమె అన్‌ఫాలో చేశారు. అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఖాతాను మాత్రం అనుసరిస్తున్నారు. తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో మహువా స్పందించారు. తాను ఏ చిత్రానికి, ఏ పోస్టర్‌కు మద్దతు ఇవ్వలేదన్నారు. తాను ధూమపానం అనే పదాన్ని వాడలేదని వివరణ ఇచ్చారు. మహువా ప్రస్తుతం క్రిష్ణానగర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంట్‌లో అయినా.. సామాజిక మాధ్యమాల వేదికల్లో అయినా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు వెల్లడిస్తారు.
సస్పెండ్ చేయాలంటూ భాజపా డిమాండ్.. ఓ చర్చా కార్యాక్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను అరెస్ట్ చేయాలని ఆ రాష్ట్ర భాజపా చీఫ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. భాజపా కార్యకర్తలు బౌబజార్ పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని మొయిత్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: ముదురుతున్న 'కాళీ' పోస్టర్ వివాదం.. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌పై కేసు