Girl Delivers a Baby Boy : కర్ణాటకలో తుమకూరులో షాకింగ్ ఘటన జరిగింది. హాస్టల్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ షాకింగ్ ఘటన జనవరి 9న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో ప్రసవించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేశారు.
ఇదీ జరిగింది
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఇటీవల హాస్టల్ నుంచి తన ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో తీవ్ర కడుపునొప్పి రావడం వల్ల తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు ఆమెను తిరిగి ఇంటికి పంపించారు. కొద్దిసేపటికే కడుపు నొప్పి రావడం వల్ల బాలిక మళ్లీ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఆమెకు చికిత్స నిర్వహించగా- బాలికకు ప్రసవ నొప్పులు అధికమయ్యాయి. చివరకు ఓ బాలుడికి ఆమె జన్మనిచ్చింది. శిశువు 2.2 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాలిక కూడా ఆరోగ్యంగా ఉందని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ జిల్లా ఆస్పత్రికి పంపించినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
మరోవైపు, వైద్యులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారంపై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం బాలికకు బాలల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇప్పించగా, పాఠశాలలో సీనియర్ విద్యార్థే తాను గర్భం దాల్చడానికి కారణమని చెప్పినట్లు పోలీసులు వివరించారు. అయితే, బాలుడిని విచారించగా నిరాకరించాడని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులూ చేయలేదని వెల్లడించారు. బాలిక, ఆమె తల్లిదండ్రులు ఏమీ మాట్లాడటంలేదని, వాళ్లకు కౌన్సెలింగ్ కొనసాగుతోందన్నారు. బాలిక చెబుతున్న మాట్లలో నిలకడ లేదని పోలీసులు పేర్కొన్నారు. పాఠశాలలో మరో విద్యార్థి పేరు కూడా చెబుతోందని, అందువల్ల అందరినీ విచారించి బాధ్యుల్ని గుర్తిస్తామని సీనియర్ పోలీస్ అధికారి వివరించారు.
హాస్టల్ వార్డెన్ సస్పెండ్
ఈ ఘటనపై జిల్లా అధికారులు సీరియస్‌గా స్పందించారు. బాలిక చదువుతున్న హాస్టల్ వార్డెన్ నివేదిత, అసిస్టెంట్ శివన్నను సస్పెండ్ చేశారు. బాలిక శరీరంలో ఎలాంటి మార్పులు కనిపించలేదని వార్డెన్ నివేదిత తెలిపారు. ఆమె ఎవరితో కలిసినట్లు కూడా గమనించలేదని చెప్పారు.
బిడ్డకు జన్మనిచ్చిన 12 ఏళ్ల బాలిక.. మద్యం కోసం సొంతవారినే..!
18వారాలకు కవల పిండం మృతి- 125 రోజులకే మరో శిశువుకు జన్మ- వైద్య రంగంలోనే అద్భుతం