రాజస్థాన్‌లోని చురుజిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను కిడ్నాప్ చేసి మరీ దారుణానికి ఒడిగట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలిక.. ఇంటర్వెల్ సమయంలో ఇంటికి వచ్చింది. అదే సమయంలో పదిహారా గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు.. బాలిక తండ్రికి ప్రమాదం జరిగిందని ఆమెతో చెప్పారు. అనంతరం కారులో ఎక్కించుకున్నారు. ఎవ్వరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో వీడియోను కూడా తీశారు. ఈ దారుణాన్ని బాలిక సోదరుడు చూశాడు.
వెంటనే సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశాడు. దీంతో వారు బాలికను వెతకడం ప్రారంభించారు. కొద్దిసేపటి తరువాత.. బాలిక అపస్మారక స్థితిలో గ్రామశివార్లలో కనిపించింది. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కాగా నిందితుల్లో నలుగురిని.. కుటుంబసభ్యులు పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బర్త్‌డే పార్టీకి వెళ్లిన బాలికపై గ్యాంగ్‌రేప్..
మహారాష్ట్రలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. అందులో ముగ్గురు మైనర్లు ఉన్నారు. నిందితుల్లో.. బాధితురాలి స్నేహితుడు కూడా ఉన్నాడు. సెంట్రల్ ముంబయిలోని లోయర్ పరేల్, చాల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి బర్త్‌డే పార్టీకి వెళ్లిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు నిందితులు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక తన మిత్రుడు(నిందితుల్లో ఒకడు)తో కలిసి, స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు వెళ్లింది. మిగతా ఐదుగురు నిందితులు కూడా ఆ బర్త్‌డే పార్టీకే వచ్చారు. పార్టీ అనంతరం బాలికపై అత్యాచారం చేశారు. ఘటన సమయంలో బాలిక అరుపులు విన్న చాల్ కాలనీ వాసులు.. సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు.. నిందితులందరిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.