G20 Meeting In Kashmir : జమ్ముకశ్మీర్‌లో జరిగే జీ-20 సదస్సును భగ్నం చేయడమే లక్ష్యంగా ఉగ్రవాద చర్యలు పెరిగిన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శ్రీనగర్‌లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్- NSGతో మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మెరైన్ కమెండోలు ఎక్కడికక్కడ గస్తీ కాస్తున్నారు. లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద భద్రతా ఏర్పాట్లను కమెండోలు పరిశీలించారు.
Kashmir Security Situation : జీ-20 సమావేశానికి సంబంధించి కొన్నిఅనుమానాస్పద టెలికమ్యూనికేషన్‌ల నుంచి బెదిరింపులు రావడం వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బలగాలు హెచ్చరికలు జారీ చేశాయి. జీ-20 సదస్సు లక్ష్యంగా కశ్మీర్‌లో అల్లర్లు సృష్టించేందుకు ఉగ్రవాదులు చేసిన చొరబాటు ప్రయత్నాలను ఇటీవల భద్రతా బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఉగ్రవాదులకు సహాయం చేసేందుకు పాకిస్థాన్ సైన్యం పంపిన డ్రోన్‌ను కూల్చి వేసేందుకు భారత్ సైన్యం కాల్పులు జరపగా ఆ డ్రోన్ తిరిగి వెళ్లింది. ఉగ్రవాదుల చర్యలు పెరిగిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలగాలు తీవ్రంగా గస్తీ కాస్తున్నాయి. శ్రీనగర్‌లో జీ-20 సదస్సులు నిర్వహించొద్దంటూ జైషే మహమ్మద్ ముసుగు సంస్థ.. పీపుల్స్ యాంటీ ఫాసిస్టు ఫోర్స్ -PAFF గతేడాదే భారత్‌ను హెచ్చరించింది.
Kashmir Article 370 : కశ్మీర్‌లో ఆర్టికల్-370ని తొలగించిన తర్వాత.. అక్కడి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ప్రపంచానికి చాటేందుకు, అక్కడ పర్యాటకాన్నిపెంపొందించేందుకు శ్రీనగర్‌లో ఈ నెల 22 నుంచి 24 తేదీ వరకు జీ-20 సదస్సు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రసిద్ధ దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్- SKICCలో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సు పర్యటక, వాణిజ్య రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
G20 Presidency : భారత్.. గతేడాది డిసెంబరులో జీ20 అధ్యక్ష పగ్గాలు చేపట్టింది. ఆ సమయంలో ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అనే థీమ్ ప్రేరణతో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు పనిచేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. తద్వారా ఉగ్రవాదం, వాతావరణ మార్పు, మహమ్మారి వంటి భారీ సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవచ్చన్నారు.
భారత్ జీ20 అజెండా ప్రతిష్టాత్మకంగా, కార్యాచరణ ఆధారితంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ జీ20 అధ్యక్ష స్థానాన్ని వైద్యం, సామరస్యం, ఆశల ప్రెసిడెన్సీగా మార్చేందుకు కలిసి పనిచేద్దామన్నారు. మానవ-కేంద్రీకృత ప్రపంచీకరణకు కొత్త నమూనా రూపొందించడానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థిరమైన జీవనశైలి, ప్రపంచ ఆహార, ఎరువులు, మందులు, ఇతర వస్తువుల సరఫరా వ్యవస్థను రాజకీయాలతో సంబంధం లేకుండా చేయటం కోసం భారత్ ఎదురుచూస్తోందన్నారు.