G 20 Summit 2023 : భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సు శనివారం ప్రారంభం కానుంది. అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన దిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. సదస్సుకు భారత్.. కనీవినీ ఎరుగని ఏర్పాటు చేసింది. అతిథులకు ఘన స్వాగతం నుంచి సదస్సు విజయవంతం అయ్యేవరకూ ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూస్తోంది. జీ20 సభ్యదేశాలతోపాటు.. బంగ్లాదేశ్, ఈజిప్టు, మారిషస్, యూఏఈ, స్పెయిన్, సింగపూర్, ఒమన్, నైజీరియా, నెదర్లాండ్స్‌ను కూడా సదస్సు కోసం భారత్ ఆహ్వానించింది. జీ20 సదస్సులో పాల్గొనే అతిరథుల్లో చాలా మంది ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. తొలుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్... తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి భారత్‌లో అడుగుపెట్టారు. సునాక్‌కు కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే స్వాగతం పలికారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం సాయంత్రం భారత్‌లో అడుగుపెట్టారు. ఆయన కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు. బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కు కొవిడ్ సోకడం వల్ల ఆయన ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దిల్లీ చేరుకున్నారు. ప్రపంచ నేతలకు విమానాశ్రయం వద్ద సంప్రదాయ నృత్యాలతో స్వాగతం లభించింది. ఐఎంఎఫ్ అధినేత క్రిస్టాలినా జార్జీవా తనకు స్వాగతం పలికిన వారితో కలిసి డ్యాన్స్ చేశారు.
చైనా ప్రధాని లీ కియాంగ్, సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడొ దిల్లీ చేరుకున్నారు. ఇటలీ ప్రధాని మెలోని, అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్, ఆఫ్రికన్ యూనియన్ ఛైర్ పర్సన్ అజాలీ అస్సౌమని కూడా తరలివచ్చారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, ఒమన్ ఉప ప్రధాని ఒమన్ సయ్యిద్ ఫహద్ బిన్ మహమ్మద్ అల్ సయ్యద్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా కూడా భారత్ చేరుకున్నారు.
భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సుపై భారీ అంచనాలే ఉన్నాయి. దక్షిణార్ధ గోళ దేశాల ఆందోళనలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దారుణ పరిస్థితులు, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థలకు పరిష్కారం చూపే దిశగా చర్చలు జరగనున్నాయి. సమ్మిళిత వృద్ధి దిశగా ప్రపంచాన్ని పరుగులు పెట్టించడంపై సదస్సు దృష్టిసారించనుంది. చైనా, రష్యా.. అమెరికాతో విభేదిస్తున్న వేళ సదస్సులో డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. సదస్సులో ముఖ్యంగా... ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో సభ్యత్వం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను పెంచడం, అంతర్జాతీయ రుణ నిర్వహణను సరళీకరించడం, క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ, గ్రీన్ డెవలప్‌మెంట్, వాతావరణ మార్పులు వంటి అంశాలపై దృష్టిసారిస్తారు. ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పేద దేశాలను ఆదుకోవడానికి, అభివృద్ధి కొనసాగడానికి వీలుగా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి బ్యాంకులను సంస్కరించి, బలోపేతం చేయాలని జీ-20 కూటమి భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తలెత్తే పరిణామాలపై చర్చలు జరగనున్నాయి.
ఇదే సమయంలో జీ-20 అధ్యక్ష పాత్రలో భారత్ పలు ప్రతిపాదనలు చేయనుంది. సమ్మిళిత వృద్ధి, డిజిటల్ ఆవిష్కరణ, వాతావరణ మార్పులు, అందరికీ సమాన ఆరోగ్య అవకాశాలపై చర్చ కోరనుంది. ఆర్థిక నేరస్థులు ఏ దేశంలో ఉన్నా వారిని కట్టడి చేయడం, అప్పగించడం, ఆస్తులను స్వాధీనం చేసుకోవడంపై ఒప్పందానికి వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని జీ-20 సభ్యదేశాలపై ఒత్తిడి చేయనుంది. ఈ సదస్సు ద్వారా మానవాళి కేంద్రంగా సమ్మిళిత అభివృద్ధికి కొత్త దారి వేస్తామని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వసుధైక కుటుంబం పేరుతో ఒకే భూమి- ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు నినాదంగా... భారత్ ఈ సదస్సు నిర్వహిస్తుండగా, ఈ నినాదాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ ప్రశంసించారు. ఉపనిషత్తుల్లోని సారాంశం ఇదేనని వ్యాఖ్యానించారు.