sidhu moose wala case: దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి (మాస్టర్ మైండ్) గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయేనని దిల్లీ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న అతడిని పలు దఫాలుగా విచారించిన దిల్లీ ప్రత్యేక పోలీసులు.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన షూటర్‌కు సన్నిహితుడైన సిద్ధేశ్ కమ్లే అలియాస్ మహాకల్‌ను పుణెలో అరెస్టు చేసినట్టు కమిషనర్ (స్పెషల్ సెల్) హెచ్‌ఎస్ ధాలీవాల్ మీడియాకు తెలిపారు. అయితే, సిద్ధేశ్ కమ్లేకు సింగర్‌ను షూట్ చేయడంలో ప్రమేయం లేదని.. అసలైన షూటర్‌ను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సింగర్ హత్య కేసుతో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను గుర్తించామన్నారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసుపై దిల్లీ ప్రత్యేక పోలీస్ విభాగం పనిచేస్తోందని.. నిందితులందరినీ సాధ్యమైనంత త్వరలోనే పట్టుకుంటామన్నారు. కేసు పంజాబ్‌లోనే నమోదైనప్పటికీ.. హంతకులను అరెస్టు చేసేందుకు తాము కృషిచేస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు, మే 29న సిద్ధూ మూసేవాలాను గుర్తుతెలియని వ్యక్తులు మాన్సా జిల్లాలో కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని పోలీసులు ప్రశ్నించగా.. ఈ హత్య తమ గ్యాంగ్ పనేనని అతడు అంగీకరించాడు. మూసేవాలాతో తమకు వైరం ఉందని.. అందుకే తమ గ్యాంగ్ సభ్యులు అతడిని చంపేశారని పోలీసుల ఎదుట అంగీకరించినట్టు ఇటీవలే పోలీసులు తెలిపారు. సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యోదంతం గ్యాంగ్‌స్టర్ల పనేనని తొలి నుంచీ పోలీసులు అనుమానిస్తూనే ఉన్నారు. ఆ దిశగానే కేసును దర్యాప్తు కొనసాగించిన పోలీసులు.. తిహాడ్ జైలులో ఉన్న బిష్ణోయ్‌ను ప్రశ్నించగా దీని వెనుక మాస్టర్ మైండ్ అతడేనని తేలినట్టు తాజాగా వెల్లడించారు.
ఇదీ చదవండి: రూ.10 కోసం గొడవ.. చాట్ దుకాణదారుడి దారుణ హత్య