Azadi ka amrit mahotsav: భారత్‌లో బ్రిటిష్ పాలనలో భాగంగానే అనేక ప్రాంతాలు సంస్థానాధీశుల చేతుల్లో ఉండేవి. వారు ఆంగ్లేయులకు కప్పం కడుతూ.. తమతమ ప్రాంతాలపై పెత్తనం చెలాయించేవారు. ఇలా భారత్ వ్యాప్తంగా చిన్నాపెద్దా అన్నీ కలిపి దాదాపు 565 సంస్థానాలు కొనసాగాయి. 'విభజించు పాలించు' సిద్ధాంతంలో భాగంగా.. ఆంగ్లేయులు వీరందరినీ తమ పావులుగా వాడుకునేవారు.
ప్రపంచయుద్ధాల సందర్భంగా సంస్థానాధీశుల్లో కొంతమందిని ఇంపీరియల్ వార్ కౌన్సిల్‌లో సభ్యులుగా చేర్చుకుంది బ్రిటిష్ ప్రభుత్వం. రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ వీరికి ప్రాతినిధ్యం కల్పించింది. యుద్ధాల్లో బ్రిటన్ తరఫున పోరాడటానికి సైనికులను పంపించేవారు ఈ సంస్థానాధీశులు. జాతీయోద్యమం తీవ్రమైన నేపథ్యంలో.. భారత్ విషయంలో తమను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దని వీరంతా బ్రిటిష్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. తెల్లవారికీ కావల్సింది అదే!
ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్..
మాంటెగో ఛెమ్స్‌ఫోర్డ్ సంస్కరణల అనంతరం .. సంస్థానాధీశుల సంఘంగా.. ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఏర్పాటైంది. వీరికి కొత్త దిల్లీలో లెజిస్లేటివ్ (ప్రస్తుత పార్లమెంటు) భవనంలో ఓ ప్రత్యేక సమావేశ మందిరాన్ని ఇచ్చారు. ఏటా ఒకసారి సమావేశమై తమ సంస్థానాలకు సంబంధించిన విషయాలను, బ్రిటిష్ ప్రభుత్వానికి చేయాల్సిన విజ్ఞప్తులను చర్చించేవారు. సుమారు 565 సంస్థానాధీశులకుగాను 120 మంది మాత్రమే ఇందులో సభ్యులుగా చేరారు. కీలకమైన హైదరాబాద్, బరోడా, ట్రావెన్‌కోర్‌లాంటివి దీనికి దూరంగా ఉన్నాయి. నేరుగా బ్రిటిష్ ప్రభుత్వంతో తమకున్న సంబంధాల నేపథ్యంలో... వారు ఈ ఛాంబర్‌కు అంతగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. మొత్తానికలా... సంస్థానాధీశులకు ప్రత్యేక గౌరవం ఇస్తూ తమ చెప్పుచేతల్లో ఉంచుకుంది బ్రిటిష్ సర్కారు.
భారత్‌కు స్వయంప్రతిపత్తి ఇచ్చినా, స్వాతంత్య్రం ప్రకటించినా ... ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంస్థానాల హక్కులకు భంగం కలగకుండా చూస్తామని హామీ ఇస్తూ వచ్చింది.
చర్చిల్ కొత్త పావులు..
రెండో ప్రపంచ యుద్ధానంతరం... తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాల్సిన తరుణం రాగానే బ్రిటన్.. ముఖ్యంగా చర్చిల్ కొత్త పావులు కదిపాడు. దేశాన్ని విడిచిపెట్టినా... ఇక్కడింకా తమకు భాగస్వామ్యం ఉండాలని ఎత్తుగడ వేశాడు. అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ వేవెల్ ద్వారా దీన్ని సాధించేందుకు ప్రయత్నించారు. 'భారత్‌లో కొంత భాగాన్ని మనకోసం ఉంచు' అంటూ వేవెల్‌కు చర్చిల్ సందేశం పంపించాడు.
వారి సాయంతో..
స్వాతంత్య్రానంతరం భారత్, పాకిస్థాన్‌లతో పాటు కొన్ని సంస్థానాలతో కూడిన ప్రిన్సిస్థాన్‌ను ఏర్పాటు చేద్దామని చర్చిల్ ప్రతిపాదించాడు. రెండు దేశాల్లోనూ చేరటానికి ఇష్టంలేని సంస్థానాధీశుల సాయంతో దీన్ని సాకారం చేయాలనుకున్నాడు. వేవెల్ ఆ మేరకు ప్రయత్నాలు మొదలెట్టాడు కూడా. హైదరాబాద్, భోపాల్, జోధ్‌పూర్, ట్రావెన్‌కోర్‌లాంటి కొంతమంది సంస్థానాధీశుల్లో ఆశలు చిగురించాయి. కానీ దైవం మరోలా తలచింది.
బ్రిటన్‌లో జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ పరాజయంపాలైంది. చర్చిల్ గద్దె దిగి... లేబర్‌పార్టీ అభ్యర్థి అట్లీ ప్రధానిగా అధికారం చేపట్టారు. భారత స్వాతంత్య్రానికి అనుకూలంగా ఉన్న అట్లీ.. వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైస్రాస్‌గా ఉన్న చర్చిల్ మనిషి వేవెల్ స్థానంలో తన నమ్మకస్థుడైన లార్డ్ మౌంట్‌బాటెన్‌ను పంపించారు. దీంతో చర్చిల్ ఎత్తుగడలు బలహీనమయ్యాయి. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ బృందం చకచకా.. సంస్థానాధీశులతో సంప్రదింపులు మొదలెట్టడంతో ప్రిన్సిస్థాన్ ప్రతిపాదన అటకెక్కక తప్పలేదు. అంతా సర్దుకున్నాక చర్చిల్ తన మాజీ విదేశాంగ మంత్రి ఆంథోనీ ఎడెన్ ద్వారా పటేల్‌కు ఓ సందేశం పంపించాడు.
'కొత్త దేశం... కొత్త బాధ్యతలు తీసుకున్న తీరు... ముఖ్యంగా సంస్థానాలు, రాష్ట్రాలతో సంబంధాల విషయంలో సర్దుకున్న తీరు అభినందనీయం. మీ ప్రతిభాపాటవాలు భారత్‌కే పరిమితం కావొద్దు. ప్రపంచం మొత్తానికి తెలియాల్సిన అవసరం ఉంది' అన్నది ఆ సందేశ సారాంశం!