పాకిస్థాన్ అనుకూల వైఖరి అవలంబిస్తూ వచ్చిన జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ(92) (Geelani Death) మృతిచెందారు. 1929 సెప్టెంబర్ 29న బందిపొరా జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించిన ఆయన.. లాహోర్‌లోని ఓరియంటల్ కాలేజీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు. అనంతరం జమాత్-ఏ-ఇస్లామిలో చేరారు. సోపోర్ నియోజకవర్గం నుంచి 1972, 1977, 1987 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 26 పార్టీలతో వేర్పాటువాద సమ్మేళనంగా ఏర్పడిన హురియత్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుల్లో గిలానీ ఒకరు.
హురియత్‌కు జీవిత కాల ఛైర్మన్‌గా ఉన్న గిలానీ.. ఆర్టికల్ 370(Article 370) రద్దు అనంతర పరిణామాలతో 2020 జూన్‌లో హురియత్‌కు గుడ్ బై చెప్పారు. హురియత్‌లో రెండోతరం నాయకత్వంలో పురోగతి లేనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా అప్పట్లో ఆయన ప్రకటించారు. ప్రస్తుతం గిలానీ మరణంతో కశ్మీర్‌లో భారత వ్యతిరేక, వేర్పాటువాద రాజకీయాల అధ్యాయానికి ముగింపు పలికినట్లు అయింది.
2002 నుంచి మూత్రపిండ సంబంధిత వ్యాధితో గిలానీ బాధపడుతున్నారు. ఈ సమస్య తీవ్రం కాగా.. ఒక కిడ్నీని తొలగించారు. గత 18 నెలలుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తూ వస్తోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ పలు సంస్కరణల కోసం పనిచేవారు గిలానీ.
గిలానీ 2010 నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు.
కర్ఫ్యూ ఆంక్షలు..
కశ్మీర్ లోయలోని మసీదులు గిలానీ(Syed Ali Shah Geelani) మృతి పట్ల సంతాపం ప్రకటించాయి. ఇక ఆయన నివాసం చుట్టూ పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. వేర్పాటువాద నేతలు పెద్దఎత్తున గుమికూడకుండా శ్రీనగర్‌లో భారీ సంఖ్యలో భద్రతా దళాలు మోహరించాయి.
ముగిసిన అంత్యక్రియలు..
కశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలగొచ్చన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో రాత్రిసమయంలోనే అంత్యక్రియలు పూర్తిచేయాలని గిలానీ కుటుంబ సభ్యులను కోరారు అధికారులు. భారీ భద్రత నడుమ ఇస్లాం మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. గిలానీ కోరిక మేరకు ఆయన నివాసానికి సమీపంలోని ఓ మసీదు ప్రాంగణంలో సమాధి చేశారు. అయితే తన తండ్రి అంత్యక్రియలను శ్రీనగర్‌లోని ఓ ఈద్గాలో నిర్వహించాలని అనుకున్నట్లు గిలానీ కుమారుడు నయీం తెలిపారు.
బంధువులకే అనుమతి..
గిలానీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించారు. బంధువులు తప్ప ఇతరులు ఆయన కుటుంబాన్ని కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. పుకార్లు, నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా మొబైల్ ఫోన్ సేవలతో పాటు, ఇంటర్నెట్ను నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి.. వాహన తనిఖీలు చేపట్టారు. శ్రీనగర్‌లోనూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించారు.
గిలానీ మృతిపై పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. 'గిలానీ మరణవార్త నన్ను చాలా కలచివేసింది. పలు అంశాలపై మా మధ్య ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. కానీ.. పట్టుదల, నమ్మకాలకు కట్టుబడి ఉండే వ్యక్తిగా ఆయనను గౌరవిస్తా' అని ముఫ్తీ ట్వీట్ చేశారు.
పాక్ స్పందన..
గిలానీ మృతి పట్ల పాకిస్థాన్ సంతాపం ప్రకటించింది. ఆయన మరణ వార్త విని తీవ్రంగా బాధపడినట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. 'దేశవ్యాప్తంగా పాక్ జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేసి.. అధికారిక సంతాప దినంగా పాటిస్తాం' అని ప్రకటించారు.
"గిలానీ మరణ వార్త విని తీవ్రంగా కలతచెందాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా."
-ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి
పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీతో పాటు.. విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి సైతం గిలానీ మరణం పట్ల సంతాపం తెలిపారు. 'న్యాయం, స్వేచ్ఛ కోసం గిలానీ జీవితకాల పోరాటానికి పాక్ గొప్ప నివాళి అర్పిస్తోంది' అని ఆ దేశ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ ట్వీట్ చేశారు.
గిలానీకి గతేడాది అత్యున్నత పౌర పురస్కారం 'నిషాన్-ఏ-పాకిస్థాన్' బిరుదును ప్రదానం చేసింది పాకిస్థాన్.
ఇవీ చదవండి: