భారత అటార్నీ జనరల్‌గా రెండు సార్లు సేవలందించిన ప్రముఖ లాయర్ సోలీ సోరాబ్జీ మరణించారు. కొవిడ్‌తో బాధపడుతున్న 91ఏళ్ల సోరాబ్జీ.. దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
1930లో ముంబయిలో జన్మించిన సోలి సోరాబ్జీ.. 1953 నుంచి బాంబే హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1971 నుంచి సుప్రీంకోర్టులో డెసిగ్నేటెడ్ సీనియర్ కౌన్సిల్‌గా కొన్నేళ్ల పాటు సేవలందించారు. పద్మవిభూషణ్ అవార్డు కూడా అందుకున్న ఆయన.. 1989లో మొదటిసారి అటార్నీ జనరల్‌గా సేవలందించారు. ఆ తర్వాత 1998 నుంచి 2004 వరకు రెండోసారి అవే బాధ్యతలు నిర్వహించారు. 1997లో సోరాబ్జీని నైజీరియాకు ప్రత్యేక యూఎన్ ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితి నియమించింది.
'న్యాయవ్యవస్థ గొప్ప వ్యక్తిని కోల్పోయింది'
మాజీ అటార్నీ జనరల్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. "భారతదేశ న్యాయవ్యవస్థ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. న్యాయవ్యవస్థ పరిణామాన్ని లోతుగా ప్రభావితం చేసినవారిలో సోలీ సోరాబ్జీ ఒకరు. పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఆయన.. ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిజేస్తున్నాను" అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
మోదీ విచారం..
సోలీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. "సోరాబ్జీ అత్యుత్తమ న్యాయవాది, మేధావి. చట్టం ద్వారా పేదలు, అణగారినవర్గాల వారికి సహాయం చేయడంలో ముందంజలో ఉండేవారు. దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి" అని మోదీ పేర్కొన్నారు.
సీజేఐ సంతాపం
సోలీ సొరాబ్జీ మృతి పట్ల సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం తెలిపారు. ప్రాథమిక, మానవ హక్కుల పరిరక్షణకు ఏడు దశాబ్దాలు ఆయన చేసిన కృషి మరువలేమని పేర్కొన్నారు. సీజేఐ ప్రజాస్వామ్యంలో కీలక స్తంభాల బలోపేతానికి ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.
ఇదీ చూడండి: దేశంలో మరో 3 లక్షల 86 వేల కరోనా కేసులు