food poison in haridwar: ఉత్తరాఖండ్‌లో దారుణం జరిగింది. హరిద్వార్‌లో బుక్వీట్ పిండితో చేసిన కల్తీ ఆహార పదార్థాలను తిని ఏకంగా 122 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. అస్వస్థతకు గురైన వారందర్నీ అధికారులు ఆసుపత్రికి తరలించారు. జీడీ ఆసుపత్రి, మేళా ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. భాజపా నాయకులు, హిందూ మత పెద్దలు బాధితుల్ని కలిసి పరామర్శించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి ధన్‌సింగ్ రావత్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ కౌశిక్, హరిద్వార్‌లోని హిందూ మత పెద్దలు ఆసుపత్రికి చేరుకుని రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు జిల్లా మేజిస్ట్రేట్ హరిద్వార్ వినయ్ శంకర్ పాండే.. రోగుల శాంపిల్స్ తీసుకుని పరీక్షించాల్సిందిగా ఆహార భద్రతా విభాగాన్ని ఆదేశించారు. రోగులందరి పరిస్థితి సాధారణంగా ఉందని ఆయన తెలిపారు. ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగ్ సంఘటన అని తెలిపారు. రోగులందరూ త్వరలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించారు. అలాగే సంబంధిత వ్యక్తులపై జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
అన్ని షాపుల శాంపిల్స్ తీసుకోవాలని.. వాస్తవాలు వెలుగులోకి వచ్చినా వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మదన్ కౌశిక్ అధికారులను కోరారు. అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కాంగ్రెస్ విమర్శించింది. అసెంబ్లీలో ఈ విషయాన్ని లెవనెత్తుతామని కాంగ్రెస్ తెలిపింది. ఈ ఘటనను కుట్రగా అభివర్ణించాయి హరిద్వార్‌లోని హిందూ సంఘాలు. ఇది హిందువులపై పక్కా ప్రణాళికతో జరిగిన కుట్రగా పేర్కొన్నారు. ఆహార భద్రత శాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు.
ఇదీ చదవండి: 'సీబీఐ ఇప్పుడు పంజరంలో చిలుక కాదు'