Five Rights Every Employee Must Be Aware Of : కొత్తగా ఉద్యోగంలో చేరినవారు చాలా ఉత్సాహంతో ఉంటారు. పనిలో తమ సామర్థ్యాలను నిరూపించుకోవాలని కుతూహలంతో ఉంటారు. వాస్తవానికి ఉద్యోగ జీవితంలో బాధ్యతలను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఉద్యోగుల హక్కులను చాలా సార్లు కంపెనీలు పట్టించుకోవు. అందుకే ఉద్యోగులు అందరూ కచ్చితంగా తమకు గల హక్కుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.
కంపెనీలు ఒక వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకునే ముందు కచ్చితంగా ఒక ఒప్పందాన్ని చేసుకుంటుంది. దీనిలో ఉద్యోగ నియమాలు, షరతులు అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగికి ఇచ్చే జీతభత్యాలు, పని గంటలు, నోటీస్ వ్యవధి, వార్షిక సెలవులు, ప్రోత్సాహకాలు, ఉద్యోగం నుంచి తొలగించే కారణాలు ఇలా అన్ని వివరాలు ఈ ఒప్పందంలో ఉంటాయి. వీటిని అనుసరించి ఉద్యోగులు తమ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. అదే సమయంలో యజమానులు కూడా ఉద్యోగుల పట్ల అనేక బాధ్యతలను కలిగి ఉంటారు. వాటిని సరిగ్గా పాటించకపోతే, ఉద్యోగులు న్యాయపోరాటానికి దిగవచ్చు.
అందుకే ఉద్యోగ ఒప్పందంపై సంతకం చేసే ముందు, అందులో పేర్కొన్న నియమ నిబంధనలు అన్నీ సరైన విధంగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలి. అలా చేయాలంటే, ముందుగా ఉద్యోగులకు ఉండే ప్రాథమిక ఉపాధి హక్కులపై ఓ అవగాహన ఉండాలి. అందుకే ఇప్పుడు ఉద్యోగులకు ఉండే 5 ప్రధానమైన హక్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- ఆన్-టైమ్ శాలరీ : కంపెనీలు లేదా యజమానులు సకాలంలో జీతభత్యాలు చెల్లించాలి. ఒక వేళ సరైన సమయానికి జీతం ఇవ్వకుండా జాప్యం చేసినా, లేక ఇస్తామన్న సాలరీ కంటే తక్కువ ఇచ్చినా, దానిపై ఉద్యోగి నిలదీయవచ్చు. ఒక వేళ సరైన సమాధానం ఇవ్వకపోతే, న్యాయపోరాటం కూడా చేయవచ్చు. బోనస్‌ల విషయంలోనూ ఇదే విధానాన్ని పాటించవచ్చు. వేతనాల చెల్లింపు చట్టం, 1936 ప్రకారం, నిర్ధిష్ట రకాల ఉద్యోగాలకు, నిర్దిష్ట వేతన బ్రాకెట్లలో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. జీతాలు సకాలంలో చెల్లించకపోతే, ఉద్యోగులు ఈ కార్మిక చట్టం ఆధారంగా, ఫిర్యాదు చేయవచ్చు. న్యాయపోరాటం చేయవచ్చు.
- సెలవులు : కంపెనీలను అనుసరించి లీవ్ స్ట్రెక్చర్ ఆధారపడి ఉంటుంది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఉద్యోగులు అందరికీ నిర్ధిష్ట సంఖ్యలో సాధారణ సెలవులు, ప్రసూతి సెలవులు, పితృత్వ సెలవులు ఉంటాయి. అలాగే పెయిడ్ లీవ్స్, సిక్ లీవ్స్, కాంపన్సేటరీ లీవ్స్, లీవ్ విత్ అవుట్ పేలు కూడా ఉంటాయి. ఒక వేళ మీరు పనిచేస్తున్న కంపెనీ వీటిని ఇవ్వడానికి నిరాకరిస్తే, కచ్చితంగా పై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. లేదా న్యాయ పోరాటం చేయవచ్చు.
- నోటీస్ పీరియడ్ : ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్‌లో, ఉద్యోగి సదరు సంస్థ నుంచి ఇష్టపూర్వకంగా నిష్క్రమించాలని అనుకుంటే, ఎన్ని రోజులు ముందు నోటీస్ ఇవ్వాలో స్పష్టంగా రాసి ఉంటుంది. అలాగే యాజమాన్యం ఒక ఉద్యోగిని ఎలాంటి పరిస్థితుల్లో తొలగిస్తుందో కూడా స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. కంపెనీలు సహేతుకమైన కారణం చెప్పకుండా, ముందుగా నోటీస్ ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించకూడదు. ఒకవేళ ఈ నిబంధనలు పాటించకుండా ఉద్యోగిని తొలగిస్తే, కచ్చితంగా న్యాయపోరాటం చేసి, పరిహారం పొందవచ్చు.
- వివక్ష నుంచి లైంగిక వేధింపుల నుంచి రక్షణ : భారతదేశ పౌరులు స్వేచ్ఛగా జీవించే హక్కును కలిగి ఉంటారు. ఉద్యోగులు కూడా ఈ హక్కులను కలిగి ఉంటారు. కులం, మతం, జాతి, వర్గం, లింగ బేధాలను అనుసరించి వీరిపై యాజమాన్యం గానీ, ఉన్నతోద్యోగులు గానీ, చివరికి తోటిపనివారు కూడా ఎలాంటి వివక్ష చూపకూడదు. పక్షపాతం వహించకూడదు అన్నింటి కంటే ముఖ్యంగా శారీరక లేదా మౌఖిక లైంగిక వేధింపులకు పాల్పడకూడదు. ఒక వేళ ఎవరైనా ఉద్యోగి ఈ వివక్షలను, లైంగిక వేధింపులను ఎదుర్కొంటే, వెంటనే యాజమాన్యానికి తెలపాలి. చాలా కంపెనీల్లో ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకమైన కమిటీలు ఉంటాయి. ఇవి మీ సమస్యను పరిష్కరిస్తాయి. ఒక వేళ అప్పటికీ వేధింపులు, వివక్షలు తగ్గకపోతే, న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
- పని గంటలు : ఫ్యాక్టరీస్ యాక్ట్ - 1948 ప్రకారం, నిర్దిష్టమైన పని గంటలు మాత్రమే ఉద్యోగం చేయాలి. ఓవర్ టైమ్ చేయడానికి కూడా స్పష్టమైన నిబంధనలు ఉంటాయి. వీటిని యజమానులు, ఉద్యోగులు అందరూ కచ్చితంగా పాటించాలి.
ఈ హక్కులు కూడా
Employee Rights In India :
- యాజమాన్యాలు తమ ఉద్యోగులకు గ్రాట్యుటీ, బోనస్, ప్రావిడెంట్ ఫండ్, మెటర్నిటీ బెనిఫిట్స్ కూడా అందివ్వాల్సి ఉంటుంది.
- మినిమం వేజెస్ యాక్ట్-1948 ప్రకారం, ఉద్యోగులకు పనికి తగిన వేతనం ఇచ్చితీరాలి.
- ఓవర్ టైమ్ చేసిన పనికి తగిన వేతనం ఇవ్వాలి.
- కాంపెన్సేటరీ లీవ్స్, పేరెంటల్ లీవ్స్, ప్రివిలైజ్ లీవ్స్ ఇవ్వాలి.
- పబ్లిక్ హాలీడేస్ సమయంలో ఉద్యోగుల చేత పనిచేయించకూడదు. ఒక వేళ చేయించినా, అందుకు తగిన వేతనం ఇవ్వాలి.
- ఆరోగ్య సంరక్షణ కూడా కంపెనీలే అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు డిస్పెన్సరీలు ఏర్పాటు చేయడం. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లు కల్పించడం లాంటివి చేయాలి.
ఈ విధంగా ఉద్యోగులు అందరూ తమకు ఉన్న హక్కులు గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అదే సమయంలో బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడే ఉద్యోగ జీవితం బాగుంటుంది.