"భూపేంద్ర పటేల్.." ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పేరు ఇది. విజయ్ రూపానీ రాజీనామాతో గుజరాత్ సీఎం పదవి ఎవరికి వరిస్తుందనే ఉత్కంఠ నెలకొన్న వేళ భాజపా నేతలు భూపేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీ మెట్లు ఎక్కిన తొలిసారే సీఎం స్థాయికి ఎదగడం ప్రత్యేకం.
తొలిసారి ఎమ్మెల్యేగా..
భూపేంద్రది(Bhupendra Patel) సున్నిత స్వభావం. కార్యకర్తలతో కలిసిపోయే గుణం. ఈ కారణంతోనే మున్సిపాలిటీ స్థాయి నుంచి ఏకంగా సీఎం పదవిని అధిరోహించే స్థాయికి చేరారు. భూపేంద్రది(Bhupendra Patel) ఘట్లోడియా నియోజకవర్గం. 2017 ఎన్నికల్లో 1.17లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో అదే రికార్డు. పైగా ఎమ్మెల్యే అభ్యర్థిగా భూపేంద్ర బరిలో దిగడం అదే తొలిసారి. అంటే.. అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారే సీఎం పదవి చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నియోజకవర్గమైన గాంధీనగర్‌లో ఈ ఘట్లోడియా భాగం.
'దాదా'..
భూపేంద్రను 'దాదా' అని ముద్దుగా పిలుచుకుంటారు ఆయన మద్దతుదారులు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. 2015-2017 మధ్యకాలంలో అహ్మదాబాద్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా బాధ్యలు నిర్వహించారు భూపేంద్ర. అంతకుముందు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా 2010-15లో సేవలందించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు భూపేంద్ర.
ఆ సమయంలోనే ఆహ్మదాబాద్ జిల్లాలోని మేమ్‌నగర్ మున్సిపాలిటీకి రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజలతో మంచి బంధం ఉండటం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు భారీగా ఓట్లు పడ్డాయి.
తెరపైకి అనూహ్యంగా...
గుజరాత్ తదుపరి సీఎంపై శనివారం నుంచే ఉహాగానాలు జోరందుకున్నాయి. వీటిల్లో అసలు భూపేంద్ర పేరే లేదు. అనూహ్యాంగా ఆయన్ని సీఎంగా ఎంపింక చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రుల ఎంపికలో భాజపా వైఖరిని పలువురు రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో పుష్కర్ సింగ్ ధామి కూడా ఇదే కోవకు చెందుతారంటున్నారు.
తనను సీఎంగా ఎన్నుకున్నారంటే తనకే ఆశ్చర్యం కలిగినట్టు వెల్లడించారు భూపేంద్ర. అప్పటివరకు తనకు అధిష్ఠానం ఏం చెప్పలేదని వివరించారు.
అచ్చం మోదీలాగే..
ఇప్పటివరకు ఎలాంటి మంత్రి పదవి చేపట్టని భూపేంద్రకు.. సీఎం బాధ్యతలను అప్పజెప్పింది భాజపా. అయితే ఇదే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి- భూపేంద్రకు సారుప్యం ఉంది. 20ఏళ్ల క్రితం గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. అంతకుముందు వరకు ఎలాంటి మంత్రి పదవిలో లేరు. 2001 అక్టోబర్ 7న సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. 2002 ఫిబ్రవరి 24న రాజ్‌కోట్ ఉపఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యేగా మారారు మోదీ.
అహ్మదాబాద్‌లో జన్మించిన భూపేంద్రకు సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉంది. హితాల్బెన్తో ఆయన వివాహం జరిగింది. ఆయకు క్రికెట్, బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారు.
ఇవీ చదవండి: