భవిష్యత్ ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ బయోటెక్ 'ఎల్లా ఫౌండేషన్' మరో ముందడుగు వేసింది. దేశంలో మొట్టమొదటి వన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు కోసం గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్- మాడిసన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక, వ్యవసాయ విద్యా పరిశోధన విభాగం, బయోటెక్నాలజీ శాఖల కార్యదర్శుల సమక్షంలో దిల్లీలో ఒప్పంద పత్రాలపై రెండు సంస్థల అధిపతులు సంతకాలు చేశారు.
కర్ణాటకలోని బెంగళూరులో వన్ హెల్త్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. నూతన పరిశోధనలు, టీకాలు, చికిత్సా విధానాలు, ప్రపంచ ఆరోగ్య విద్యను అభివృద్ధి చేయడానికి ఈ వన్‌హెల్త్ సెంటర్ కృషి చేయనుంది. ప్రపంచ ఆరోగ్య పర్యవేక్షణ, పరిశోధనలు, విద్య, ప్రచారాలు, మానవులు, జంతువులు, మొక్కలలో అంటు వ్యాధులను నివారించడం కోసం పనిచేయనుంది.
దేశంలో నూతన వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి చేయడంపై ఈ హెల్త్ సెంటర్ దృష్టి పెట్టనుంది. ఇంటర్ డిసిప్లినరీ సహకారాన్ని అందించడం ద్వారా విస్కాన్సిన్ యూనివర్సిటీ తన ఆలోచనలను విస్తరించనుంది. భారతీయ విద్యార్థులు, పరిశోధకులకు నైపుణ్య శిక్షణకు సహకారం అందించనుంది. భారతీయ పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందించనుంది. 2023 చివరి నాటికి బెంగళూరులో ఈ వన్‌హెల్త్ సెంటర్ అందుబాటులోకి రానుంది.
వన్‌హెల్త్ సెంటర్ ఒప్పందం కుదిరిన అనంతరం భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల మీడియాతో మాట్లాడారు. తమ సంస్థ తయారుచేసిన కరోనా నాసికా టీకా(ఇన్‌కొవాక్) 3 లక్షల డోసులను దేశంలోని కొన్ని ఆస్పత్రులకు పంపినట్లు ఆయన తెలిపారు.
"భారత్ బయోటెక్ సంస్థ రెండు రోజుల క్రితం మూడు లక్షల కొవిడ్ నాసికా టీకాలను ఆస్పత్రులకు పంపింది. ఈ వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయాలని కొన్ని దేశాలు, ఏజెన్సీలు మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. బెంగళూరులోని వన్ హెల్త్ సెంటర్ 2023 చివరి నాటికి అందుబాటులోకి వస్తుంది. వన్ హెల్త్ సెంటర్ కొత్త వ్యాక్సిన్‌ల అభివృద్ధి, ఉత్పత్తిని ముందుకు తీసుకువెళుతుంది."
--కృష్ణ ఎల్ల, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్