Fire Cracker Explosion : బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బంగాల్లోని తూర్పు మేదినీపుర్ సహర గ్రామపంచాయితీ పరిధిలోని ఖాదికుల్ గ్రామంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఎగ్రా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. పేలుడు మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పేలుడు శబ్దం విన్న గ్రామస్థులు ఒక్కసారిగా ఘటనాస్థలికి భారీగా చేరుకున్నారు.
ట్రక్కు బోల్తా... 15 మందికి..
మధ్యప్రదేశ్ బేతుల్‌లో ఓ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. వీరందరూ ట్రక్కులో పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని.. 11 మంది క్షతగాత్రులను బైందేహి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తీవ్రంగా గాయపడి.. పరిస్థితి విషమంగా ఉన్న మరో నలుగురిని బేతుల్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం రాత్రి జరిగిందీ ప్రమాదం.
ట్యాంక్‌లో దిగి ఇద్దరు మృతి..
రాజస్థాన్ కోటాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంక్‌ను క్లీన్ చేసేందుకు దిగి ఇద్దరు కూలీలు ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు స్పృహతప్పి పడిపోయారు. సోమవారం సాయంత్రం జరిగిందీ ఘటన.
అసలేం జరిగిందంటే..
రాన్పుర్లోని ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో వాటర్ ఫిల్టర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఐదుగురు కూలీలు దిగారు. అయితే వారందరూ అక్కడే స్పృహతప్పి పడిపోయారు. ఎంతసేపైనా ఐదుగురు ట్యాంకు నుంచి బయటకు రాకపోవడం వల్ల ఇతర కార్మికులు ప్రమాదానికి గురయ్యారేమోనని ఆందోళన చెందారు. వెంటనే వారిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ లోకేశ్ (28), రామ్‌రతన్ (30) అనే కార్మికులు ఇద్దరు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం పరీక్షల అనంతరం ఆ రెండు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం పరీక్షల తర్వాతే కూలీల మృతికి గల కచ్చితమైన కారణం తెలుస్తుందని అన్నారు.
బాణాసంచా పరిశ్రమలో పేలుడు.. 9 మంది మృతి..
ఈ ఏడాది మార్చిలో తమిళనాడులో జరిగిన ప్రమాదంలో 9 మంది మరణించారు. కాంచీపురంలోని ఓ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ బాణసంచా ప్లాంటులో 30 మందికిపైగా పనిచేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.