Uttar Pradesh fire accident : ఉత్తర్‌ప్రదేశ్ కుషీనగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు పిల్లలు, వారి తల్లి నిద్రలోనే సజీవదహనమయ్యారు. మరణించిన చిన్నారుల వయసు 1 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉంటుందని పోలీసులు తెలిపారు. చిన్నారుల మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభాతి తెలిపారు. ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్ కుషీనగర్ ప్రాంతంలోని ఉర్థ గ్రామంలో నివసించే ఓ కుటుంబానికి చెందిన ఇంట్లో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో సంగీత (38), ఆమె ఐదుగురు పిల్లలతో కలిసి నిద్రిస్తున్నారు. ఇంట్లో నుంచి పేలుడు శబ్దం వినిపించిన వెంటనే.. ఆరుబయట నిద్రిస్తున్న ఆమె భర్త అప్రమత్తమై చుట్టుపక్కల వారి సహాయంతో వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఎంతకీ మంటలు చల్లారకపోవడం వల్ల ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసి.. వారిని బయటకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే వారు మరణించారు. ప్రమాదంలో మరణించిన చిన్నారులను బాబు(1), గీత(2), రీటా(3), లక్ష్మిణ (9), అంకిత్(10)గా పోలీసులు గుర్తించారు. అయితే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని.. కొద్ది క్షణాల్లోనే ఇంట్లో ఉన్న సిలిండర్‌కు మంటలు అంటుకుని అది పేలడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
కూమార్తెకు క్యాన్సర్ సోకిందని తండ్రి ఆత్మహత్య.. కూతురుకు క్యాన్సర్ వ్యాధి సోకిందనే బాధతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన బెంగళూరులో బుధవారం సాయంత్రం జరిగింది. నగరంలోని డెయిరీ సర్కిల్లోని పోలీస్ క్వార్టర్స్‌లో ఆయన ఈ ఇలా చేశారు.
దావణగెరె జిల్లాకు చెందిన కుమార్(44) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని డెయిరీ సర్కిల్లో నివాసముంటున్నారు. నగరంలోని అశోక్ నగర్ ఠాణా పరిధిలో కుమార్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కుమార్ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఈ క్రమంలో తన కూతురులో క్యాన్సర్ వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో తన కుమార్తెకు వైద్యం చేయించారు. చికిత్స అనంతరం ఆమె క్రమంగా కోలుకుంటోంది. అయితే తన కూతురికి కూడా క్యాన్సర్ సోకడం వల్ల మనస్తాపానికి గురైన కుమార్ బుధవారం సాయంత్రం తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు.