నిషేధిత ప్రాంతంలో అనుమతి లేకుండా నిరసన ప్రదర్శన చేపట్టినందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సహా మరో 18 మంది విపక్ష నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పట్నాలోని గాంధీ మైదానంలో నాలుగో నెంబర్ గేటు వద్ద తేజస్వీ యాదవ్, ఆర్జేడీ మిత్రిపక్షాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి.
మైదానంలో జరిగిన అందోళనలకు హాజరైన 18 మంది నాయకులతో పాటు మరో 500 కార్యకర్తల పైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వీరిపై ఐపీసీలోని పలు సెక్షన్లు, అంటువ్యాధుల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నాయి.
నగర నడిబొడ్డున ఉన్న గాంధీ మైదానం సమీపంలో ప్రదర్శన నిర్వహించడం ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి... ప్రజల ప్రాణాలకు ముప్పు చేకూర్చినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న కరోనా నిబంధనలను బేఖాతరు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసిన వారిలో తేజస్వీతో పాటు శ్యామ్ రజాక్, బ్రిశేన్ పటేల్, అలోక్ మెహతా, మృత్యుంజయ్ తివారీ, మరి కొంత మంది కాంగ్రెస్, సీపీఐ నాయకులు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా డీఎంకే, ఆర్జేడీ నిరసనలు