యూఏఈకి చెందిన ఓ భారతీయ వ్యాపారవేత్త అరుదైన అనుభూతి పొందారు. భారత్‌లోని అమృతసర్ నుంచి దుబాయికి ఆయన ఒక్కరే.. ఎయిరిండియా విమానంలో ప్రయాణం చేశారు. మూడు గంటల పాటు తోటిప్రయాణికుల లేకుండా.. తాను మాత్రమే వెళ్లడంపై పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎస్పీ సింగ్ ఒబెరాయి. ఈ గొప్ప అవకాశాన్ని దక్కించుకున్న ఒబెరాయి.. 'ఇప్పటివరకు ఇలా ప్రయణించినవారుండరేమో! నాకు మాత్రం 'మహారాజు'లా అనిపించింది' అంటూ ఆనందంతో ఉప్పొంగుపోతున్నారు.
"జూన్ 23న సాయంత్రం 4 గంటలకు ఎయిరిండియా(ఏఐ-929) విమానంలో అమృత్సర్ నుంచి దుబాయికు వెళ్లాను. ఫ్లైట్ మొత్తంలో నేనొక్కడినే ప్రయాణికుడిని కావడం నా అదృష్టం. మహారాజులా ప్రయాణించాను. విమాన సిబ్బంది.. నన్ను ఎంతో గౌరవంగా చూసుకున్నారు. ఖాళీ విమానంలో సిబ్బంది, పైలట్‌తో పాటు ఫొటోలు తీసుకున్నా."
- ఎస్పీ సింగ్ ఒబెరాయి.
మూడు గంటల ప్రయాణం తర్వాత తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్లు ఒబెరాయి తెలిపారు. అయితే ప్రయాణికులు ఎవరూ లేకపోవడం చాలా బోరింగ్ అనిపించిందని చెప్పారు. కాలక్షేపం కోసం విమానంలో సీట్లు, కిటికీలు లెక్కబెట్టినట్లు పేర్కొన్నారు. విమానం పొడువును కొలిచినట్లు తెలిపారు.
పౌర విమానయాన జోక్యంతో
యూఏఈ నిబంధనల ప్రకారం.. పూర్తి వ్యాక్సినేషన్ వేసుకున్నట్లు అన్ని పత్రాలతో ఒబెరాయి సిద్ధమైనప్పటికీ.. విమాన ఎక్కడానికి ఎయిరిండియా అధికారులు అనుమతించ లేదు. అయితే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జోక్యంతో ఆయన ప్రయాణానికి అడ్డంకులు తొలగాయని ఒబెరాయి తెలిపారు. మరోవైపు ఇలా ఒక్కరినే తీస్కువెళ్లడానికి గల కారణాలు తెలియరాలేదు.
మళ్లీ అవకాశం వచ్చినా..
మళ్లీ ఇలాంటి అవకాశం వస్తే.. కచ్చితంగా ప్రయాణించనని ఒబెరాయి చెప్పడం గమనార్హం. జీవితంలో ఇటువంటి అనుభవం ఒక్కసారి అయితేనే బాగుంటుందన్నారు. ఒక్కరే ప్రయాణించడం చాలా బోరింగ్‌గా ఉంటుందని చెప్పారు. అయితే దీనిపై ఎయిరిండియా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదీ చదవండి:ఊరంతా పాములు- వాటితోనే పిల్లల ఆటలు