Father Kills Daughter Honor Killing : హరియాణాలోని గురుగ్రామ్‌లో పరువు హత్య కలకలం రేపింది. కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంతోనే.. కన్నతండ్రే గొంతు నులిమి హతమార్చాడు. అందుకు ఆమె తల్లి, సోదరుడు కూడా సహకరించారు. ఆ తర్వాత అంతా కలిపి ఆమె మృతదేహానికి రహస్యంగా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. మృతురాలిని 22 ఏళ్ల అంజలిగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లోని సెక్టార్- 102లో బాధితురాలు అంజలి తన భర్త సందీప్‌తో కలిసి నివాసం ఉంటోంది. అయితే ఆగస్టు 17వ తేదీ ఉదయం అంజలి భర్త సందీప్.. తన సోదరికి తీజ్ పండుగ సందర్భంగా మిఠాయిలు ఇచ్చేందుకు రోహ్తక్కు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అంజలి సోదరుడు కునాల్.. ఆమె ఇంటికి చేరుకున్నాడు.
ఆ తర్వాత తన తండ్రి కుల్దీప్, తల్లి రింకీకి ఫోన్ చేసి అంజలి ఇంటికి రప్పించాడు. అనంతరం ఒక్కసారిగా అంజలిని ఆమె తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. అందుకు బాధితురాలు తల్లి, సోదరుడు సహకరించారు. తనను చంపవద్దని అంజలి ఎంత ప్రాధేయపడినా పట్టించుకోకుండా చంపేశారు. స్థానికంగా ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేస్తున్న కుల్దీప్.. ఓ కారులో అంజలి మృతదేహాన్ని తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో రహస్యంగా దహనం చేసేశారు.
Honor Killing Haryana : అంజలి హత్య గురించి విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే అంజలి మృతదేహం పూర్తి కాలిపోయిందని ఏసీపీ వరుణ్ దహియా తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించనుందని చెప్పారు. ఈ పరువు హత్య కేసు గురించి అంజలి భర్త సందీప్‌కు అతడి స్నేహితుడి ద్వారా తెలియజేసినట్లు చెప్పారు. దీంతో సందీప్.. వెంటనే గురుగ్రామ్‌కు వచ్చి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అంజలి హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది డిసెంబర్ 19వ తేదీన ఓ ఆలయంలో బాధితురాలు.. అదే గ్రామానికి చెందిన సందీప్‌తో ప్రేమ వివాహం చేసుకుందని పోలీసులు చెప్పారు.