ఎవరైనా అల్లుడికి కట్నంగా డబ్బులు, కారు లేదా బైక్ ఇవ్వడం చూస్తుంటాం. మరికొందరు భూమి, ఖరీదైన ఇల్లు ఇస్తుంటారు. అయితే ఉత్తర్ప్రదేశ్ హమీర్పుర్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన అల్లుడికి కట్నంగా బుల్డోజర్ను ఇచ్చారు. ఇలా అల్లుడికి మామ.. బుల్డోజర్ను ఇస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఇదీ జరిగింది..
సుమేర్‌పుర్.. దేవ్‌గావ్ గ్రామానికి చెందిన పరశురామ్ ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. ఆయన కుమార్తె నేహాను నేవీలో పనిచేస్తున్న యోగేంద్రకు ఇచ్చి డిసెంబరు 15న వివాహం జరిపించారు. అనంతరం, అందంగా ముస్తాబు చేసిన బుల్డోజర్ను అల్లుడికి అందజేశారు. దీంతో పెళ్లికి హాజరైనవారందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
తన కూతురు సివిల్స్ కోసం సన్నద్ధమవుతోందని.. అందులో విఫలమైనా జీవనోపాధికి బుల్డోజర్ పనికొస్తుందని పరశురామ్ తెలిపారు. తన కుమార్తెకు కట్నంగా విలాసవంతమైన కారు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని పరశురామ్ అన్నారు. ఇదిలా ఉంటే ఉత్తర్ప్రదేశ్లో నేరగాళ్ల పని పట్టేందుకు యోగి సర్కార్.. బుల్డోజర్లను ఉపయోగించేది. ఈ నేపథ్యంలో అల్లుడికి కట్నంగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి.. బుల్డోజర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.