Farmers protest end: సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు సాగిన ఆందోళనలను విరమించిన రైతులు శిబిరాలను ఖాళీ చేస్తున్నారు. బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ సహా.. పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు ఇళ్లకు బయలుదేరారు. దిల్లీ సరిహద్దుల్లోని గాజియాబాద్, కౌశాంబి ప్రాంతాల్లోని నిరసన ప్రదేశాలను వీడుతూ.. విజయ యాత్రగా ఇళ్ల దారిపట్టారు. సంతోషంతో నృత్యం చేస్తూ.. ఊరేగింపుగా స్వస్థలాలకు తరలిపోతున్నారు. గుడారాలు, శిబిరాలను తొలగించి సామగ్రితో స్వస్థలాలకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో తమకు మద్దతుగా నిలిచినవారికి బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ఉద్యమం వాయిదా మాత్రమే పడిందని, ఆగిపోలేదని మరోసారి స్పష్టం చేశారు.
"రైతులకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. లంగర్‌లను నడిపినవారికి, అన్నదాతలకు నిత్యావసరాలు తెచ్చిన గ్రామస్థులకు ధన్యవాదాలు. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి. ఉద్యమాన్ని వాయిదా వేశాం కానీ.. ఉపసంహరించుకోలేదు."
- బీకేయూ నేత రాకేశ్ టికాయిత్
సాగుచట్టాల రద్దు సహా తాము లేవనెత్తిన డిమాండ్ల పరిష్కారంపై కేంద్రం నుంచి అధికారిక లేఖ అందడం వల్ల రైతు సంఘాలు తమ ఆందోళనను ముగిస్తున్నట్లు గురువారం(డిసెంబరు 9) ప్రకటించాయి. జనవరి 15న మరోసారి సమావేశమై ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చిందో లేదో చర్చిస్తామని రైతు నేతలు చెప్పారు. ఈ ఏడాది కాలంలో తమకు సహకరించిన వారిని సన్మానిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: ప్లాన్ బెడిసికొట్టి 12 అడుగుల పైనుంచి పడిన కొత్తజంట