రైతుల నిరసనల్లో(Farmers protest) భాగంగా ఈనెల 29న నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు సంయుక్త కిసాన్ మోర్చా(Samyukta Kisan Morcha) నేతలు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 27న మరోమారు సమావేశం కానున్నట్లు తెలిపారు. సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు(Farm laws repeal) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM modi news) ప్రకటించినప్పటికీ రైతులు ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది.
సింఘు సరిహద్దులో(Singhu Border) సమావేశమైన నేతలు సుదీర్ఘంగా చర్చించి రైతు ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు బల్బీర్ సింగ్ రజెవాల్. సాగు చట్టాల రద్దును స్వాగతిస్తున్నామని, అయితే, చాలా విషయాలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు.
"వ్యసాయ చట్టాల రద్దుపై చర్చించాం. ఆ తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈనెల 22న లఖ్‌నవూలో కిసాన్ పంచాయత్, 26న అన్ని సరిహద్దుల్లో రైతుల సమావేశం, 29న పార్లమెంట్‌కు ర్యాలీగా తరలివెళ్లటం వంటివి ఉన్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 27న మరోమారు సమావేశం అవుతాం."
- బల్బీర్ సింగ్ రజెవాల్, రైతు నేత
ఎంఎస్పీ కమిటీ, విద్యుత్తు బిల్లు 2020, రైతులపై కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లతో ప్రధాని మోదీకి లేఖ రాస్తామని తెలిపారు బల్బీర్ సింగ్. లఖింపుర్ ఖేరి హింస కేసులో భాగంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయానున్నట్లు తెలిపారు.
లఖ్‌నవూలో మహాపంచాయత్..
సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. చాలా అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది సంయుక్త కిసాన్ మోర్చా. తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో సోమవారం కిసాన్ మహాపంచాయత్(kisan mahapanchayat) నిర్వహిస్తామని స్పష్టం చేసింది. నగరంలోని ఎకో గార్డెన్లో నిర్వహించాలని కొద్ది నెలల ముందే ప్రణాళిక చేసినట్లు తెలిపింది. ఎంఎస్పీపై చట్టం తీసుకురావటం, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను విధుల నుంచి తొలగించటం వంటివి చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు రైతు నేతలు. 'ఎంఎస్ చట్టం కోసం మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు ఛలో లఖ్‌నవూ. వ్యవసాయ సంస్కరణలపై కేంద్రం చెప్పేవన్నీ ఉట్టి మాటలే. వాటి వల్ల రైతుల పరిస్థితి ఏమి మారదు. కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకొచ్చినప్పుడే అతిపెద్ద సంస్కరణ' అని పేర్కొన్నారు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయిత్.
ఇదీ చూడండి: ఫలించిన అన్నదాతల పోరాటం.. సాగు చట్టాలు రద్దు