Farmers Built Bridge On Krishna River : మనసుపెడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని నిరూపించారు కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాకు చెందిన రైతులు. రూ.7.25 లక్షలు చందాలు వేసుకుని కృష్ణా నదిపై ప్లాస్టిక్ బ్యారెళ్లతో 600 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న వంతెన నిర్మించారు. ప్రభుత్వ సహాయం లేకుండా స్వయంగా రైతులే దశాబ్ద కాలంగా తమను ఇబ్బంది పెడుతున్న సమస్యకు పరిష్కారం కనుగొన్నారు.
జిల్లాలోని జమఖండి మండలంలోని కంకణవాడి గ్రామంలో దాదాపు 200 రైతు కుటంబాలు ఉన్నాయి. ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా చెరకును ఎక్కువగా సాగుచేస్తారు. అయితే కంకణవాడి గ్రామానికి.. పంట పొలలాకు మధ్య కృష్ణా నది ప్రవహిస్తోంది. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాలన్నా, పంట రవాణా చేయాలన్నా నది దాటాలి. లేకపోతే పక్కనున్న ఊళ్లన్నీ తిరిగి రావాల్సిన పరిస్థితి. దీంతో పంటను రవాణా చేయాలంటే పడవులను ఆశ్రయించాలి. అలా పడవలో పంటను తరలించేందుకు రైతులు రూ. 800 నుంచి రూ.1000 చెల్లించాల్సి వస్తోంది.
అయితే, పడవలో రవాణా చేస్తే ప్రమాదమని రైతులు వాపోతున్నారు. దీంతో ఏళ్లుగా ఉన్న సమస్యకు ఎలాగైనా పరిష్కారం కనుగొనాలని రైతులు సంకల్పించారు. అందులో భాగంగా రైతులు అందరూ చందాలు వేసుకున్నారు. అలా జమ అయిన రూ. 7.25 లక్షలతో బ్యారెల్ వంతెన నిర్మించారు. ప్లాస్టిక్ బ్యారెళ్లను వరుస క్రమంలో అమర్చారు. వాటిని ఇనుప రాడ్డులతో అనుసంధానించి నీటిపైన తేలియాడే 600 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న బ్రిడ్జి నిర్మించారు.
"బ్యారెళ్లతో నిర్మించిన వంతెనా చాలా సౌకర్యంగా ఉంది. దీని వల్ల బైక్లు, సైకిళ్లు, పశువుల రాకపోకలు సులభం అయ్యాయి. ప్రభుత్వ సహాయం లేకుండా రైతులే స్వయంగా ఈ వంతెనను నిర్మించారు. కృష్ణా నది అవతల దాదాపు 500 ఎకరాల భూమి ఉంది. అక్కడికి వెళ్లాలన్నా.. పడవలో వెళ్లాల్సిందే. రాత్రి పూట ప్రయాణం ప్రమాదకరం. కానీ ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది"
--రాజు నదాఫ్, కంకణవాడి గ్రామపంచాయతీ సభ్యుడు
ఈ నీటిపై తేలియాడే ఈ వంతెన ప్రజల రాకపోకలకు మాత్రమే కాకుండా పొలాల నుంచి చెరకు, వివిధ వస్తువులు రవాణా చేయడానికి కూడా ఉపయోగపడుతోంది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కంకణవాడి రైతులు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.