వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్‌లో భారత్‌లో ఆకస్మిక కరవులు పెరగుతాయని గాంధీనగర్‌లోని ఐఐటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల పంటల దిగుబడి, సాగునీరు, భూగర్భ జలాలపై పెను ప్రభావం పడుతుందని వారు తెలిపారు.
నేలలో తేమ వేగంగా తగ్గిపోవడం వల్ల ఆకస్మిక కరవులు వస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. సంప్రదాయంగా వచ్చే కరవులకు భిన్నంగా ఇలాంటి విపత్తులు.. రెండు మూడు వారాల్లోనే భారీ విస్తీర్ణంలోని ప్రాంతాలపై ప్రభావం చూపుతాయి. వాటివల్ల పంటలు దెబ్బతింటాయి. అయితే భారత్‌లో వీటి తీరు తెన్నుల గురించి పెద్దగా వివరాలు అందుబాటులో లేవు. తాజా అధ్యయనంలో ఐఐటీ పరిశోధకులు.. మానవ చర్యల వల్ల తలెత్తిన భూతాపం, ఒకే సీజన్లో చోటుచేసుకునే వైరుధ్యాలు వంటి అంశాలు ఆకస్మిక కరవులపై చూపే ప్రభావం గురించి పరిశోధించారు.
1979లో అత్యంత తీవ్రస్థాయి ఆకస్మిక కరవు తలెత్తినట్లు పరిశోధకులు తేల్చారు. దానివల్ల దేశంలో 40 శాతానికి పైగా భూభాగం ప్రభావానికి లోనైనట్లు గుర్తించారు. 21వ శతాబ్దం చివరి నాటికి ఇలాంటి విపత్తులు ఏడు రెట్లు పెరుగుతాయని వారు చెప్పారు. ప్రధానంగా రుతుపవనాల్లో అవరోధాలు, జాప్యాల కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:దక్షిణ భారతంలో ఈసారి వేసవి వేడి తక్కువే!