Health expenditure in India : ఆరోగ్యం కోసం 2018-19లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి రూ.5,96,440 కోట్లు ఖర్చయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన 'నేషనల్ హెల్త్ అకౌంట్స్ ఎస్టిమేట్స్' (జాతీయ ఆరోగ్య ఖర్చుల అంచనాల) నివేదిక వెల్లడించింది. ఇది జీడీపీలో 3.16%కి సమానమని పేర్కొంది. ఆ ఏడాది వైద్య ఆరోగ్య సేవలు అందించేందుకు తలసరి రూ.4,470 ఖర్చు చేసినట్లు వెల్లడించింది. రోజువారీ వైద్యసేవల ఖర్చు రూ.5,40,246 కోట్లు (90.58%) కాగా, మూలధన వ్యయం రూ.56,194 కోట్లు (9.42%). వైద్య సేవల కోసం ప్రజలు సొంతంగా రూ.2,87,573 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం వ్యయంలో ప్రైవేటు ఆసుపత్రులు, ఔషధ దుకాణాలకే అత్యధిక మొత్తం వెళ్లింది.
- మూలధనంతో పాటు రోజువారీ సేవలకైన వ్యయంలో ప్రభుత్వ వాటా రూ.2,42,219 కోట్లు. జీడీపీలో 1.28%కి ఇది సమానం. ప్రభుత్వపరంగా తలసరి వ్యయం రూ.1,815.
- 2018-19లో ప్రభుత్వాలు చేసిన మొత్తం బడ్జెట్ వ్యయంలో వైద్యరంగం కోసం కేటాయించింది 4.81%. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 34.3%, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 65.7%.
జీడీపీలో తగ్గుతున్న వాటా
ఆరోగ్యం కోసం చేస్తున్న మొత్తం వ్యయాన్ని జీడీపీతో పోల్చిచూస్తే గత ఏడేళ్లలో క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2004-05లో జీడీపీలో 4.2% వ్యయం చేయగా, 2013-14లో 4% ఉంది. ఆ తర్వాత క్రమంగా 3.2%కి తగ్గింది. తలసరి వ్యయం మాత్రం రూ.1,201 నుంచి రూ.4,470కి పెరిగింది.
- మొత్తం ప్రభుత్వ వ్యయంలో కేంద్రం వాటా 2017-18లో 40.8% ఉండగా, 2018-19లో అది 34.3%కి తగ్గిపోయింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చు వాటా 59.2% నుంచి 65.7%కి చేరింది.