రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన చండీప్రసాద్ జోషి అనే మాజీ సైనికుడు రాజస్థాన్ జోధ్‌పుర్‌లోని.. తన 104వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. 1965 భారత్-పాక్ యుద్ధానికి సాక్షిగా నిలిచిన జోషి ప్రస్తుతం కూడా అదే ఉత్సాహంతో ఉన్నారు. తన పుట్టినరోజు వేడుకలకు అతని కుటుంబసభ్యులతో పాటుగా, సామాజిక కార్యకర్తలు, జోధ్‌పుర్ ఆర్మీ బేస్‌కు చెందిన కొందరు సైనికులు కూడా హాజరయ్యారు. యూనిఫాం చూడగానే ఒక్కసారిగా జోషి ఉత్సాహం రెట్టింపు అయింది.
ఉత్తరాఖండ్‌కు చెందిన చండీప్రసాద్ జోషి 1969లో ఆర్మీ నుంచి పదవీవిరమణ పొందారు. అప్పటి నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో నివాసం ఉంటున్నారు. జోషికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. పుట్టినరోజు వేడుకలకు హాజరైన సైనికుల పక్కన కూర్చొన్న జోషి.. తన యుద్ధ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో తాను రంగూన్‌లో పోరాడానని చెప్పారు. మాజీ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదుర్ శాస్త్రిలను కలిసినట్లు చెప్పారు. దీనితో పాటు అప్పట్లో జోధ్‌పుర్‌లో విద్యాభ్యాసానికి తాను ఎంతో కృషి చేశానని తెలిపారు.