EVM Troubles Across Telangana 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ (Telangana Assembly Elections polling) కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పలు చోట్ల ఈవీఎంలు మొరాయింపుతో కాసేపు పోలింగ్ నిలిచిపోవడంతో.. ఓటర్లు ఇబ్బంది పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ 33వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం పనిచేయలేదు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని 63వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించింది.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని 117వ బూత్‌లో, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్ బూత్ 153లో ఓటింగ్ యంత్రాలు పనిచేయలేదు. అధికారులు తక్షణమే స్పందించి దానిని సరి చేశారు. సికింద్రాబాద్‌లోని.. కంటోన్మెంట్ నియోజకవర్గం రెజిమెంటల్ బజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 209లో ఈవీఎం మొరాయింపుతో.. ఓటర్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. పోలింగ్ ఆలస్యంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఓటు వేసేందుకు క్యూ ఎంత ఉంది - ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు : సీఈఓ వికాస్‌రాజ్
Telangana Assembly Elections polling 2023 : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలోని 199వ బూత్‌లో ఈవీఎం మొరాయించింది. దీంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అలాగే రాయపర్తి మండల కేంద్రంలోని 169 బూత్‌లో.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని బంగారుగడ్డలో గల 120 నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటింగ్ యంత్రాలు పనిచేయలేదు. సుమారు గంట పాటు ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి తమ ఓటు వేసే విధంగా చర్య తీసుకోవాలని వారు అధికారులను కోరారు.
విధులతో పాటు బాధ్యతనూ నిర్వర్తిస్తాం - ఓటెత్తిన ప్రభుత్వాధికారులు
Telangana Assembly Elections 2023 : వరంగల్ నియోజకవర్గంలోని దేశాయిపేట నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో.. ఈవీఎం పనిచేయలేదు. దీంతో గంట పాటు పోలింగ్ నిలిచింది. వెంటనే అధికారులు స్పందించి.. మరో యంత్రాన్ని ఏర్పాటు చేయడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వనపర్తి జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో.. ఓటింగ్ యంత్రాలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
ఓటేసిన రాజకీయ ప్రముఖులు - విద్యావంతులంతా తమ బాధ్యత నిర్వర్తించాలని పిలుపు
సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ పాఠశాల ఈవీఎం మొరాయించింది. దీంతో ఓటర్లు గంటల తరబడి క్యూ లైన్‌లోనే నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని గాంధీనగర్ పోలింగ్ కేంద్రంలోని.. ఓటింగ్ యంత్రం పనిచేయలేదు. సాంకేతిక సమస్య తలెత్తడంతో గంటసేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. అధికారులు వెంటనే మరో ఈవీఎం యంత్రాన్ని ఏర్పాటు చేసి ఎన్నిక సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సండోన్‌పల్లి గ్రామంలోని 85వ నంబర్ పోలింగ్ కేంద్రంలో.. వీవీ ప్యాట్ యంత్రం మొరాయించింది. దీంతో సుమారు అరగంట సేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. వెంటనే అక్కడ చేరుకున్న అధికారులు.. వీవీ ప్యాట్ యంత్రాన్ని సరిచేశారు.
ఇట్స్ పోలింగ్ టైమ్ - 3.26 కోట్ల మంది సిరాచుక్కతో తీర్పు రాసే సమయం